Monday, October 24, 2016



                                                                    Dr. Parvatham Venkateshwar
                                                                                                               9177566741

బీసీలు పారిశ్రామికంగా ఎదిగితేనే భవిష్యత్‌   

              
లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ పారిశ్రామికవేత్తలకు ఎక్కువ సదుపాయాలు, రాయతీలు అందించడం ఈ పదం అర్థం. ఇప్పటికే మార్కెట్ లో బలంగా ఉన్న పారిస్రామిక సంస్థలతో కొత్త సంస్ధలు పోటీ పడడానికి అవస రమైన శక్తిని సంతరించుకునేటట్లు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే బలంగా, సామాజిక పురోభివృద్ధికి భారంగా మారిన సామాజిక ఆధిపత్య శక్తులతో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పోటీ పడే విధంగా, కొత్తగా రంగం మీదికి వచ్చేందుకు అణగారిన కులాలకు అవస రమైన చేయూత నివ్వాల్సిన అవసరం లేదా? మరి సోషల్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ గురించి పాలకులు ఎందుకు ఆలోచించడం లేదు. ఇది కాదా వివక్ష? అలా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్తినా? 70 ఏళ్ల స్వతంత్ర్ భారతం లోనూ అగణారిన వర్గాలు, ముఖ్యంగా బీసీల దుస్థితికి అంతం లేదా? ఏరంగం లోనైనా ఆధిపత్య శక్తులదే వీరంగం. ఇంకా చాలా కులాలు, అనేక కుటుం బాల్లో మొదటి తరం విద్యావంతులు ఉద్భవించలేదు. మరో వైపు 90 శాతానికి పైగా మార్కులు వచ్చినా తన సోదరికి పోస్టు గ్రాడ్యూయేషన్ సీటు రాలేదని, అందుకే పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని, గుజరాత్‌లో అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉన్న పటేళ్ల వర్గాల ప్రతినిధి హార్థిక్ పటేల్ లాంటి వారు ఉద్యమిస్తున్నారు. ఉన్న రిజర్వేషన్లను సరిగా అమలు పరచని అధికార యంత్రాంగం ఒకవైపు, అసలు రిజర్వేషన్ల స్ఫూర్తినే దెబ్బతీసే ఉద్యమాలు మరో వైపు, వీటికి లోపాయికారీగా అండదండలు అందించే అగ్రకుల పాలకవర్గాలు ఇంకో వైపు.. ఇలా ఇవన్నీ కలిసి బీసీలపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఇక కనిపించని దాడులు, కుట్రలు, కుతంత్రాలకు లేక్కేలేదు. అందేకాదు, దేశ వ్యాప్తంగా వెనుకబడిన తరగతులు అన్ని రకాల వెనుకబాటు తనంలో ముం దున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో గాని, తెలంగాణలో గానీ బీసీల పరిస్థితి ' కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్లు'' ఉంది. బీసీలు రాజకీయ అణచివేతను ఎదుర్కొంటుండగా, ఎంబీసీలు రాజకీయ అణచివేతతో పాటు సామాజిక వెలివేతకు గురవు తున్నారు. ఇంకా కొన్ని గ్రామాల్లో రజక, మంగలి వంటి కింది కులాలవారిని సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. తాజాగా ఖమ్మంలోని నేలకొండ పల్లి మండలం ఆరెగూడెంలో ముత్యాలమ్మ పండుగకు సహకరించలేదని రజకు లను గ్రామ బహిష్కరణ చేశారు. వీరు చేసిన పాపమల్లా ఒక్కటే, మా పిల్లలు చదువుకుంటున్నరు. మేము ముసలోళ్లమయ్యాం. పండుగకు సల్లకుండ ఎత్తలేమని చెప్పడమే వీరికి శాపమైంది. దీనిని బట్టి అణగారిన కులాల పిల్లలు చదువుకున్నా ఓర్వలేని తనం, వృద్ధుల పట్ల కనీస మానవత్వం ప్రదర్శించలేని కురచబుద్ధి. ఈ దొంతర్ల సామాజిక వ్యవస్థలో కూడుగట్టుకున్నదనే విషయం మరో సారి వెల్లడైంది. సామాజికంగా బీసీల పరిస్థితి ఈ విధంగా ఉంటే, రాజకీయంగా మరి ఎంత అట్టడుగున ఉన్నారో 2014 లో జరిగిన సార్వత్రిక లెక్కలను చూస్తే అర్థమవుతుంది. తెలంగాణలో మొత్తంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా, వాటిలో బీసీల సంఖ్య 20 మాత్రమే. జనాభా ప్రాతిపదికన చూస్తే 50 శాతం మంది ఉండగా, చట్టసభల్లో వీరు కూర్చునేది కేవలం 16 శాతమే. పదిశాతం ఉన్న అగ్రకులాలవారు 60 శాతం సీట్లు సాధించి 50 శాతానికి పైగా స్థానాల్లో పాగా వేశారు. ఆంధ్రప్రదేశ్ లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీసీలు 36 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక య్యారు. అంటే జనాభాలో సగం ఉన్న బీసీలకు దక్కిన ప్రాతినిధ్యం 20 శాతమే. అదే అగ్రకులాల విష యానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో పది శాతం కూడా లేని అగ్రకులాలు 101 ఎమ్మెల్యే స్థానాల్లో తిష్టవేసి, సుమారు 50 శాతం రాజకీయ అవకాశాలను కబ్జా చేశారు. పార్లమెంటు స్థానాల విషయంలోనూ అంతే. ఏ లెక్కల పట్టిక చూసినా ఆధిపత్య శక్తుల పట్టునే ప్రకటిస్తోంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న గ్రామీణ ఆర్థిక రంగంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్న బీసీలకు దక్కుతున్న ప్రతిఫలం ఈ విధంగా ఉంటే, ఇది నవభారతమెలా అవుతుంది? బీసీ వ్యక్తి నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయినా బీసీల జీవితాల్లో వెలుగులు ఏవీ? మరి ఎందుకు బీసీ నాయకుడు ప్రధాని అయ్యాడని చెప్పడం? ఇది ఈ వర్గాలను వంచించడం కాదా? ఈ మొత్తం పరిస్థితిని చూస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన వారికి సోషల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవసరం అని అనిపించలేదా? ఈ ప్రశ్నలోంచి పుట్టిందే బీసీ సాధికారత సంస్థ. మాజీ మంత్రి, ఎంపీ టీ. దేవేందర్ గౌడ్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ సంస్థ గత రెండు సంవత్స రాలుగా చేస్తున్న కృషి బీసీల్లో ఒక కదలిక తెచ్చిందనే చెప్పాలి. నలుగురు కూర్చొని, కష్టాలు, కడగండ్లను కలబోసుకుందామనుకున్నా ఒక వేదిక లేని అనేక కులాలకు బీసీ సాధికారత సంస్థ ఆసరా అయింది. ఇలాంటి కృషిని చిత్తశుద్ధితో ఎవరు చేసినా ఆహ్వానించాల్సిందే. అనాదిగా వెట్టిలో, ఈ మట్టిలో మగ్గిన ఈ జాతులకు ఆధునిక ప్రపంచాన్ని అందుబాటులోకి తేవడం, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునే వెసులు బాటు కల్పించడం ప్రజా ప్రభుత్వాల కనీస బాధ్యత అని గుర్తింపజేయడం అవసరం. ఆధునిక భారతీయ ఆత్మ అయిన రాజ్యాంగంలోని మొదటి వాక్యంలో పేర్కొన్నట్లు' వుయ్‌ది పీపుల్ ఆఫ్ ఇండియా' అనే సమున్నత భావన అందరిలోనూ మనస్ఫూర్తిగా కలిగే విధంగా అందరికీ, అన్నిటా సమాన అవకాశాలను కల్పించే బాధ్యతను ఎంతత్వరగా గుర్తిస్తే.. అంత మంచిది. లేదంటే భవిష్యత్తు చిత్రపటం ఏ విధంగా ఉండాలో కాలమే నిర్ణయించుకుంటుంది   
  అణగారిన జాతికే నాయకత్వం  
భారతదేశంలో వర్ణవ్యవస్థ బలమైన సాంస్కృతిక నేపథ్యం, కర్మసిద్ధాంతం, మతభావన ఈ దేశంలోని మెజారిటీ జనాలను అణగద్రొక్కి ఉంచుతుంది. పాళితులుగానే ఉంచుతుంది. సర్వసంపదలకు సృష్టికర్తలైన శూద్రకులాల వారు, రాజ్యాధికారానికి దూరంగానే ఉంటున్నారు, అవిద్య, అంటరానితనం, పేదరికం, ఆత్మగౌరవహీనత వీరిని తరతరాలుగా పీడిస్తూనే ఉన్నాయి. రాజ్యాధికారానికి రాని జాతి నశించి పోతుందని, ఈ దేశంలో అత్యంత పీడితులైన దళితుల సమస్యలకు పరిష్కారం దళిత రాజ్యాధికారం స్థాపించడమేనని డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఎప్పుడో చెప్పారు. ఈ మాటను రుజువు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రాజ్యాధికారానికి రాని అనేక జాతులు కనుమరుగయ్యా యన్నది జగమెరిగిన సత్యం. అందువల్ల ఈ దేశ సమస్యల పరిష్కారానికి పీడిత దళిత బహుజన జాతుల మనుగడ శాశ్వతంగా ఉండటానికి ఈ జాతుల రాజ్యాధికారం అవసరమన్నది మేధావుల అభిప్రాయం. నెల్సన్‌ మండేలా వీరోచిత పోరాటం ఆఫ్రికన్‌ నల్లజాతివారు తమనేలను తామేలుకుంటానికి దోహదం చేసాయి. భారతదేశంలో 85%గా ఉన్న బి.సి., దళిత కులాలవారు కాకుండా 15%గా ఉన్న ద్విజకులాల వారు రాజ్యాధికారంలో ఉండటం ప్రధాన వైరుధ్యం. సహజంగానే వీళ్ళ పాలన ద్విజకులాల, వర్గాల అనుకూల ధోరణిలోనే కొనసాగుతుంది..దేశంలోని మెజారిటీ ప్రజలైన దళిత బహుజనులకు రాజ్యాధికారం వచ్చి కొన్నేళ్ళు కొనసాగితే తప్ప దేశ సమస్యలు తీరవన్నది పీడిత కుల, వర్గ మేధావుల అభిప్రాయం. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. 21వ శతాబ్ది దళిత బహుజన రాజ్యాధికారానిదే, పీడిత వర్గాలదే అని ఈ శతాబ్ది మొదటి దశాబ్దిలో చాలా మంది మేధావులు అభిప్రాయపడ్డారు. అందుకు దాహరణలుగా అమెరికా అధ్యక్షులుగా ఒబామా ఎన్నిక కావడం, మాయావతి లాంటి దళిత మహిళలు ముఖ్యమంత్రి కావడం చూపారు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఉద్యమాలు ఉధృతం కావడం అందరిలో ఆశాభావాన్ని రేకెత్తించింది సామాజిక న్యాయాన్నాశించే బి.సి.కులస్థుడే అయినప్పటికీ ఆతడు బోయకులంలో పుట్టిన వాల్మీకిలా, బెస్తకులంలో పుట్టిన వ్యాసుడిలా, గొల్లవాడైన శ్రీకృష్ణుడిలా వైదికీకరణం చెంది మనువు చెప్పిన మూడు ద్విజకులాల ప్రయోజనాలు కాపాడే వాడన్నది సత్యం. అందుకోసం దళిత బహుజన పీడిత రాజ్యాధికారం రావడానికి ఆ కులాల్లోంచి వచ్చినవాడు అధికారంలోకి వస్తే మాత్రమే సరిపోదు. ఆ కులాల్లోంచి రావడమే కాకుండా వాళ్ళ సమస్యలను జీర్ణించుకొని బలమైన సైద్ధాంతిక పునాదితో వచ్చే నాయకుడు కావాలి. దళిత బహుజన పీడిత వర్గ దృక్పథమున్న, సిద్ధాంత నేపథ్యమున్న అంబేద్కర్‌ లాంటి నాయకుడు కావాలి. ఫూలే లాంటి నాయకుడు కావాలి.అందువల్ల దళిత బహుజన రాజ్యాధికారానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు నాయకత్వం వహించాలన్న చర్యముందుకొచ్చింది. బి.సి / ఎస్సీ / ఎస్టీ / మైనార్టీలంతా బహుజనులే అయినా ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగింది. బి.సి.లు (మైనారిటీలు), ఎస్సీలు (ఎస్టీలు). అంటే బి.సి.లు దళితులు ఇందులో ప్రధానపాత్ర వహిస్తారు. బి.సి.ఎస్సీల మధ్యనున్న స్వల్పవైరుధ్యాలను పరిష్కరించుకొని ఐక్యతతో ముందుకెళితే తప్ప బహుజన (దళిత) రాజ్యాధికారం సాధ్యం కాదు.   దళిత, బహుజన రాజ్యాధి కారం కోరు కుంటున్నది తరతరాల యుగయుగాల పీడన నుండి బయటపడి మనుషులుగా జీవించడానికి, అందుకు కారణమైన కులవ్యవస్థను నిర్మూలించడానికి, మనిషిని మనిషిగా చూసే వ్యవస్థ రావడానికి వేల ఏండ్లుగా అధికారానికి దూరమున్న బహుజనులు అధికారంలోకి వస్తే మానవీయత పెరుగుతుంది. అధికారంలోకిరాని జాతి అంతరించి పోతుందన్న అంబేద్కర్‌ మాటలను గుర్తుచేసుకొని ఈ దేశపు మూలవాసులు, ప్రాచీనజీవులైన బహుజనులు రాజ్యాధికా రానికి రావాల్సిన అవసరముందన్న విషయాన్ని గుర్తించుకోవాలి. పీడిత జాతుల నుంచి నాయకత్వం రావడం వల్ల నిర్ణయాల్లో పీడితజన ప్రజాస్వామిక స్వభావముటుంది. మానవీయతుంది.  . దేశ విదేశాల మద్దతూ లభిస్తుంది

 బీసీ రిజర్వేషన్లకు క్రీమీలేయర్‌  
ఒకవైపు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు కేంద్రంలోని విద్యా, ఉద్యోగాల బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ నిబంధనను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. కానీ ఇందుకు విరుద్ధంగా జాతీయ బీసీ కమిషన్‌ ఇటీవల ఇప్పుడున్న క్రీమీలేయర్‌ నిబంధనలకు అదనంగా మరో నాలుగు వర్గాలను చేరుస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై కేంద్ర మంత్రి మండలి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రధానంగా దేశంలోని ఉద్యోగ సంఘాలు, బీసీ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు సామాజిక అసమానతలను రూపుమాపడానికి, పరిపాలనలో పేద కులాలకు భాగస్వామ్యం కల్పించడానికి ప్రవేశపెట్టిన రిజర్వేషన్లకు ఆర్థిక పరిమితులు పెట్టడం సిద్ధాంత పరంగా వ్యతిరేకం.
వర్గ సిద్ధాంతం ప్రకారం పేదవారి అభివృద్ధి కోసం పోరాడే కమ్యూనిస్టులు, మావోయిస్టులు కూడా ఈ రోజు కులాన్ని గుర్తించారు. మన సామాజిక వ్యవస్థ నిర్మాణంలో, వర్గంలో కులం ఉంది. కులంలో కూడా వర్గం ఉన్నా అంత ప్రాధాన్యత సంతరించుకోని అంశం. అంటే పేద వర్గంలోనే పేద కులాలు ఉన్నవి. అయితే కులం కోణం నుంచి పరిశీలించినప్పుడు అగ్రకులాల్లో కూడా కొందరు పేదవారు ఉన్నారు. కానీ ఈ విభజన కింద అభివృద్ధి చర్యలు తీసుకుంటే ఈ అవినీతి వ్యవస్థలో మొత్తం నిర్మాణమంతా అవినీతిపరుల చేతుల్లో ఉన్నందున అభివృద్ధి చర్యలు ముందుకు సాగవు. ఎవరికీ న్యాయం జరుగదు. కానీ అగ్రకులాలకు పేదరికం ఉన్నా సామాజిక హోదా, గౌరవం ఉంది. పేదకులాల్లో 95 శాతం పేదవర్గాలే ఉంటాయి. విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాలలో అణిచివేతకు గురైన వారి అభివృద్ధికి ఏ కారణం, ఏ ప్రాతిపదిక అడ్డంకి- అవరోధమయ్యామో అవే ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం ప్రజాస్వామ్య హక్కు. కొన్ని శతాబ్దాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాల అభివృద్ధికి ప్రజాస్వామ్య వ్యవస్థలో రిజర్వేషన్లు అనివార్యం. రాజ్యాంగబద్ధంగా వీరి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రక్రియలో అనేక వాద, వివాదాలు రావడం సహజం.
రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ ప్రకారం వెనుకబాటుతనం గుర్తించి రిజర్వేషన్లు పెట్టడానికి విద్య, ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం లేని కులాలను గుర్తించి సాంఘిక, విద్యా వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్‌లో కూడా ఇదే అంశం స్పష్టంగా ఉంది. ఆర్థికాంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎక్కడా లేదు.రాజ్యాంగ రచయితల దృక్పథంలో గానీ, సామాజిక శాస్త్రవేత్తల దృక్పథంలో గానీ కేవలం సామాజిక వివక్ష కారణంగానే రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. రిజర్వేషన్లపై అనేక సిద్ధాంతపరమైన చర్చలు జరిగాయి. తాత్త్విక, హేతుబద్ధ, శాసీ్త్రయ కోణాలలో చర్చలు జరిగాయి. సమాజాన్ని, సమాజ నిర్మాణాన్ని లోతుగా అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు కూడా ‘కులపరమైన’ విధానాన్ని ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలని సూచించారు. శతాబ్దాల తరబడి కులవృత్తులు చేస్తూ - విద్యా - విజ్ఞానం, అధికారం, హోదాలకు ఈ కులాలను దూరంగా ఉంచారని, అందుకు కులాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికపై పెట్టాలనే విషయంపై హైకోర్టులు - సుప్రీంకోర్టులో ఇప్పటికీ గత 67 సంవత్సరాలుగా కొన్ని వందల సార్లు చర్చలు జరిగాయి. వందలాది తీర్పులు వచ్చాయి. అయితే మండల్‌ కమిషన్‌ తీర్పు మినహా మిగతా తీర్పులన్నీ సామాజిక వెనుకబాటునతనం, విద్యారంగంలో వెనుకబాటుతనం ఆధారంగానే తీసుకోవాలని తీర్పులు వచ్చాయి. మండల్‌ కమిషన్‌ తీర్పు కూడా కొన్ని షరతులతో సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. అంతేకాదు గతంలో మండల్‌ కేసుకు ముందు ఆ తర్వాత కూడా అనేక సుప్రీంకోర్టు తీర్పులు - హైకోర్టు తీర్పులు కూడా సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నాయి.కులాన్ని - కుల వివక్షను, సాంఘిక అసమానతలను ఆర్థిక కోణంలో చూడరాదు. సామాజిక వివక్ష వేరు, ఆర్థికంగా వెనకబడి ఉండడం వేరు. ఒక బీసీ కులం వారు ఆర్థికంగా ఉన్నవారైనా సామాజికంగా గౌరవం ఉండదు. కుల వివక్షను తొలగించడానికి, ఈ కులాలకు సమాజంలో అధికారం ఇచ్చి పాలనలో భాగస్వామ్యం కల్పించాలనే ప్రాతిపదికగా రిజర్వేషన్లను పెట్టారే తప్ప ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కాదు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆర్థికంగా బలపడటం వేరు, సామాజిక వికాసం చెందడం వేరు. ఆర్థికంగా ఎదిగినవారు సామాజికంగా ఎదగకపోవచ్చు. విద్యా, ఉద్యోగ రంగాలలో ఎదిగిన కుటుంబాలవారే సామాజికంగా అభివృద్ధి చెందారు. కొన్ని కులాలకు ముఖ్యంగా వడ్డెర, వాల్మీకి, చాకలి, మంగలి, వీరముష్టి, పాముల, బుడుబుక్కల, గంగిరెద్దులవాళ్ళు, మేదర, కుమ్మర, కురుమ తదితర 40 కులాల వారికి సమాజంలో గౌరవం లేదు. ఇప్పటికీ ఈ కులాలను సమాజంలో చిన్నచూపు చూస్తారు. ఈ కులాల నుంచి ఒక ఐఏఎస్‌, ఐపీఎస్‌, కనీసం గ్రూపు-1 ఆఫీసర్‌ ఒక్కరూ లేరు. క్రీమీలేయర్‌ పెడితే ఈ కులాలవారు ఎలా అధికారంలో రిజర్వేషన్లు పొందుతారు? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కులాలకు క్రీమీలేయర్‌ అడ్డంకి కాదా?
అంటరాని కులాలకు - అస్పృశ్యతకు గురవుతున్న కులాలకు సామాజిక హోదా, గౌరవం పెంచడానికి ఆయా రంగాలలో ప్రాతినిధ్యం పెంచాలి. ఈ వర్గాలకు అధికారంలో వాటా ఇవ్వాలి. రిజర్వేషన్ల ద్వారా ఉన్నత స్థాయి ఉద్యోగాలలో చేరితే ఈ వర్గాలకు చెందిన వారి సాంఘిక హోదా పెరుగుతుంది. ఒక వ్యక్తిని సమాజంలో ఆర్థిక స్థితిని బట్టి కాక కులాల్ని బట్టి గౌరవించే సంప్రదాయం రెండువేల సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ వ్యత్యాసాలు పోవాలంటే పేద కులాలకు అధికారం, హోదా, పదవులు ఇవ్వాలి. ఉన్నత అధికార పదవుల ద్వారా అధికారంలోకి వస్తే పేద కులాల సాంఘిక హోదా పెరుగుతుంది. ఉదాహరణకు రిజర్వేషన్ల నుంచి వచ్చిన కులాల వారు ఒక కలెక్టర్‌గానో, డిప్యూటీ కలెక్టర్‌గానో ఒక ప్రొఫెసర్‌గానో ఉన్నత ఉద్యోగాలలో ఎంపికైనపుడు వారికి సమాజంలో అగ్రకులాల వారితో సమానంగా సభలలో కూర్చోబెడతారు. కానీ అదే కోట్ల శ్రీమంతుడు ఎవరైనా ఈ కులాలలో ఉన్నా గౌరవం-హోదా ఇవ్వరు. అధికారానికి, సాంఘిక హోదాకు అవినాభావ సంబంధం ఉంది. పేద కులాల సాంఘిక హోదా, గౌరవం పెరగాలంటే ఉన్నత ఉద్యోగంలో చేరాలి. ఉన్నత ఉద్యోగాలలో చేరాలంటే రిజర్వేషన్లు కావాలి. అందుకే పేద కులాల వారికి రిజర్వేషన్లు పెట్టారు. పైగా మన సమాజంలో ‘ఆర్థిక స్థితి’ శాశ్వతం కాదు. ‘కులం’ శాశ్వతం. ఈ రోజు పేదవాడు రేపు కోటీశ్వరుడు కావచ్చు. అలాగే కోటీశ్వరుడు భిక్షగాడు కావచ్చు. కానీ తక్కువ కులం వారు అగ్రకులం వారు కారు. అగ్రకులాల వారు తక్కువ కులంవారుగా మారరు. ఒక బీసీ కులం వారు అగ్ర కులంగా మార్పు చెందరు. అలాగే ఒక అగ్ర కులం వారు ఒక బీసీ కులంగా మార్పు చెందబోరు. ఇది ఒక వాస్తవికమైన తాత్త్విక సామాజిక విధానం. ఘనీభవించిన సత్యం.
క్రీమీలేయర్‌ నిబంధన ఒక బీసీ వర్గానికే ఎందుకు విధించాలి? రిజర్వేషన్లు 9 వర్గాలు పొందుతున్నాయి. ఇతర వర్గాలకు లేని క్రీమీలేయర్‌ బీసీలకు ఎందుకు? ఓపెన్‌ కాంపిటీషన్‌ వర్గాలకు కూడా క్రీమీలేయర్‌ పెడితే అగ్ర కులాలలోని పేదవారికి ఉద్యోగాలు దక్కుతాయి కదా! ఎస్సీ/ఎస్టీ/మహిళా కోటాలకు క్రీమీలేయర్‌ పెట్టకుండా బీసీలకు పెడితే ఏమైనా న్యాయం ఉందా? ఓపెన్‌ కాంపిటీషన్‌ ఉద్యోగాల భర్తీలో సాధారణంగా అగ్రకులాలవారికే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇందులో కూడా క్రీమీలేయర్‌ పెడితే అగ్రకులాల్లోని పేదవారికి దక్కుతాయి కదా! ఇటీవల సమాజంలో వచ్చిన పరిణామాలలో బ్రాహ్మణులు ఆర్థికంగా చాలా చిక్కిపోయారు. రెడ్లు, కాపులు, వెలమలు కూడా చాలా మంది లేబర్‌ పనికిపోయే వారున్నారు. ఇక్కడ క్రీమీలేయర్‌ పెడితే ఇందులో ఉన్న పేదవారికి ఉద్యోగాలు వస్తాయి. క్రీమీలేయర్‌ పెడితే మొదట ఇక్కడ నుంచి ప్రారంభించాలి. అప్పుడు మిగతా వారికి పెడితే అభ్యంతరాలు ఉండవు.
కేంద్రంలో బీసీ ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టి దాదాపు 23 సంవత్సరాలు గడిచింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన గణాంకాలలో బీసీ ఉద్యోగులు 9 శాతం దాటలేదు. 67 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత 56 శాతం జనాభా గల బీసీల్లో 9 శాతం ఉద్యోగులు దాటలేదంటే ఇంకెప్పుడు వీరి ప్రాతినిధ్యం పెరుగుతుంది. క్రీమీలేయర్‌ పెడితే చాలామంది అర్హత కోల్పోతారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ బీసీ కమిషన్‌ సిఫార్సులను తిరస్కరించవలసిన అవసరం ఉంది. ఇప్పటికే క్రీమీలేయర్‌ను తొలగిస్తూ తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చట్టాలు తయారుచేశాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలలో క్రీమీలేయర్‌ను అమలు చేయడం లేదు. సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ క్రీమీలేయర్‌ను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలి
సమగ్ర బీసీ కమిషన్ కావాలె  
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి వేలాది కోట్లు వెచ్చించింది. ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా చర్యలతో ముందుకు వస్తున్నది. ప్రభుత్వ లక్ష్యం బీసీల సమగ్ర వికాసం. కనుక అమలుచేసే ప్రతి పథకం ఈ వర్గాల అభివృద్ధికి బాసటగా నిలవాలి. అమలుచేస్తున్న అన్ని పథకాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. సక్రమంగా అమలు జరగాలి. అలాగే కొత్త పథకాలు కూడా రూపకల్పన చేయాలి. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. ఈ నేపథ్యం లో తెలంగాణ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి. ఆ కమిషన్‌ను బీసీలకు మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగించుకోవాలి.
బీసీల సమగ్ర వికాసానికి దోహదపడే విధంగా తెలంగాణ బీసీ కమిషన్ చట్టం రూపొందించాలి. ఉమ్మడి రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి నాటి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేశాయి. బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలో అభివృద్ధిలోకి రావాలని ఉద్యమించి దశలవారీగా సాధించుకున్న సంక్షేమ పథకాలైన ఫీజు రీయింబర్స్‌మెంట్, మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు, రుణాల మంజూరు, వేలాది సంక్షేమ హాస్ట ళ్ళు, విద్యా, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు సక్రమంగా అమల య్యేట్లు చూడాలి. 
వీటి అమలులో క్రమంగా అనేక లోపాలు, అక్రమాలు అవక తవకలు చోటు చేసుకున్నాయి. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అమలు తీరుతెన్నులు పరిశీలించడం, ఉదాసీన వైఖరిని కట్టడి చేయడం, అధికారులలో జవాబుదారీతనం పెంపొందించ డం, కొత్త పథకాలకు రూపకల్పన నిరంతరం చేయాలి. అందుకు ప్రస్తుత బీసీ కమిషన్ చట్టం 20/1993ను సమూలంగా మార్పులు చేసి విశేషాధికారాలను కల్పించి రాజ్యాంగబద్ధ హక్కులతో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ను పునరుద్ధరించాలి. ఈ విధంగా రాష్ర్టంలో ఉన్న 52 శాతం జనాభా బీసీల సమగ్రాభివృద్ధికి ముందుకు వచ్చి చర్యలు చేపట్టినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం.ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం బీసీ కమిషన్‌కు బీసీ జాబితాలో కులాలను తొలగించడం, చేర్చడం కులాల జాబితాను సమీక్షించడం, ప్రభుత్వం కోరితే ఏదైనా అంశంపై నివేదికలు సమర్పించడంలాంటి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత చట్టం మేరకు కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించే విధానం లోపభూయిష్టంగా ఉన్నది. బీసీల వాస్తవ జీవన స్థితిగతులపై ఏమాత్రం పరిజ్ఞానంలేని వారిని నియమించడం జరుగుతున్నది. రిటైర్డ్‌జడ్జిలను నియమిస్తుండటం వల్ల వయోభారంకు తోడుగా పనిభారం వలన వారు సరిగా పనిచేయలేకపోతున్నారు. 
వీరికి బీసీల సామాజిక స్థితిగతులు, సమస్యలపట్ల అవగాహన ఉండడం కూడా అరుదు. విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్లు, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సమీక్షించడానికి సంకల్పించిన గౌరవ సుప్రీంకోర్టు శాశ్వత ప్రాతిపదికన జాతీయ స్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో బీసీ కమిషన్లు నెలకొల్పాలని సూచించింది. ప్రసిద్ధ మండల కమిషన్ కేసు ఇందిరా సహాని వర్సెస్ భారతప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది.1993 నుంచి దేశవ్యాప్తంగా జాతీయస్థాయిలో, రాష్ర్టాల స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిష న్లు నెలకొల్పబడ్డాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్లకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించకుండా కేవలం సమీక్షలు, నివేదికలు, సూచనలకు మాత్రమే పరిమితం చేయడంతో క్రమంగా బీసీ కమిషన్లు ఈ వర్గాల ఉన్నతికి ఏమాత్రం తోడ్పడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీల సమగ్ర వికాసం కోసం పలు రాష్ర్టాలు కమిషన్ చట్టాల్ని సవరించి పటిష్టం చేసుకున్నాయి.ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మహిళ, మైనార్టీ కమిషన్లకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించారు. కానీ బీసీ కమిషన్లకు ఈ వర్గాలపై పరిజ్ఞానంలేని జడ్జీలను నియమించాలనే నిబంధన ఎందుకు? సాధారణంగా రిటైర్డ్ జడ్జిలు చైర్మన్లుగా పనిచేయడాని కి సమ్మతిస్తారు. అయితే ఈ హోదా వారికి సమాజంలో గౌరవం లభించడానికి మాత్రమే దోహదం చేస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని బీసీ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో పర్యవేక్షించి చర్యలు చేపట్టడానికి కమిషన్ అధికారాలను విస్తృత పర్చాలి. 
అందుకు ఉత్త ప్రదేశ్ బీసీ కమిషన్ చట్టాన్ని పరిశీలించాలి. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం పరిమితి మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచడం అవసరం. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల హోదాలను ఇక్కడి మన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సమానం చేయాలి. ఇందుకు బీహార్, సిక్కిం బీసీ కమిషన్‌లను నమూనాగా స్వీకరించాలి. బీసీ కమిషన్ చైర్మన్‌గా ఈ సామాజిక వర్గాలకు చెందిన సామాజికవేత్తను (లేదా) సామాజిక హక్కుల కోసం విశేషంగా పనిచేసిన రాజనీతిజ్ఞుడిని నియామకం చేయడానికి కమిషన్ చట్టం 20/1993 సవరించాలి. దీనికి సిక్కిం, కర్నాటక, యూపి బీసీ కమిషన్ చట్టాలను పరిశీలించాలి.విద్యా, ఉద్యోగ రంగాలలో 29 శాతం రిజర్వేషన్లు పొందేందుకు వీలు కల్పిస్తున్న (ఉమ్మడి రాష్ట్రంలోని) బీసీ కులాల జాబితాలోని 138 కులాలను 112 కులాలకు కుదిస్తూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.3 ను విడుదల చేసింది. కులాల జాబితాలో చేర్పులు మార్పుల కోసం ఏ ప్రభుత్వమైనా ఆయా రాష్ర్టాల బీసీ కమిషన్ల నుంచి నివేదికను కోరాల్సి వుంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టా ల ఏర్పాటు తరువాత ఇంత వరకు బీసీ కమిషన్లు ప్రత్యేకంగా పునరుద్ధరించలేదు. కమిషన్లకు చైర్మన్ సభ్యులను నియమించలేదు. అలాగే బీసీలకు మరింతగా మేలు జరిగేందుకు మన ప్రభుత్వం ఈ అంశంలో పటిష్ట చర్యలు చేపట్టాలి. దీనికోసం వివిధ రాష్ర్టా ల బీసీ కమీషన్ చట్టాలను పరిశీలించి ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
బీహార్ రాష్ట్ర బీసీ కమిషన్ చట్టం చైర్మన్, సభ్యుల హోదాలను అక్కడి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో సమానంగా వర్తింపజేస్తున్నది. బీహార్ ప్రభుత్వం మొదటనే చట్టంలో చైర్మన్ నియామకానికి ఎలాంటి ప్రత్యేకమైన నిబంధనలను లేకుండా రూపొందించింది. ఇక్కడి కమిషన్ కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను, రిజర్వేషన్ల తీరు తెన్నులను పర్యవేక్షిస్తుంది. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పిస్తుంది. ఇలా మనదంటూ సమగ్ర బీసీ కమీషన్‌ను తెలంగాణ రాష్ట్రంలో రూపొందించుకోవాలి. అప్పుడే బీసీల జీవన ప్రమాణాలలో మెరుగైన ప్రగతిని ఆకాంక్షించడం సాధ్యం.  

బి.సి.లకు సబ్‌ప్లాన్‌  
తమకు సబ్‌ప్లాన్‌ కావాలనే బి.సి.ల ఆందోళనలు రోజు రోజుకి ఉధృతమౌతున్నాయి. భారతదేశంలో 3000 సంవత్సరాలుగా కులవ్యవస్థ కొనసాగుతోంది. 15శాతం లోపువున్న కొన్నిఆధిపత్య కులాలే చదువు, సంపద తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. 85శాతం ప్రజలున్న కులాలకు చదువూ, సంపదా నిషేధించడం ఓ వాస్తవం. చదువూ దాని ఫలితంగా కొనసాగుతున్న సామాజిక అసమానతలను తొలగించాలి. అందుకోసం ప్రభుత్వరంగంలో రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలి. ప్రయివేట్‌ రంగంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి.లకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. అదే విధంగా రిజర్వేషన్లకే పరిమితం కాకుండా బి.సిల సంక్షేమ పధకాలు సక్రమంగా అమలు కావడానికి, వారి ఆర్థిక స్థితి బాగుపడటానికి ఎస్సీ.ఎస్టీ సబ్‌ప్లాన్‌ తరహాలో బి.సి సబ్‌ప్లాన్‌ రూపొందించి చట్టబద్ధత కల్పించాలి. అప్పుడు సామాజిక స్థితిలో కూడా క్రమంగా మెరుగుదలకు అవకాశముంటుంది. అందుకని ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్లతో పాటు బి.సి. సబ్‌ప్లాన్‌ కోసం కూడా ఉద్యమాలు సాగాలి. డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ 1949లో రాజ్యాంగంలో కల్పించిన రక్షణగురించి వివరిస్తూ, 'రాజ్యాంగంలో బి.సి.లకు సంబంధించిన రక్షణలను పొందుపరుచలేకపోయినందుకు చింతిస్తున్నాను. భారత అధ్యక్షుని ద్వారా నియమితమైన బి.సి. కమిషన్‌ సిఫార్సులను అమలు చేసి వారి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వాలపై వుంది.' రాజ్యాంగం ప్రవేశపెట్టే సమయంలో గానీ, స్వాతంత్య్ర అనంతరం గానీ బి.సి.లకు ప్రభుత్వాలు ఒరగబెట్టిందేమీలేదు. స్కాలర్‌షిప్‌, రుణాలు, కొద్దిపాటి సబ్సిడీలు, అరకొర రిజర్వేషన్లు అమలు బి.సి.ల అభివృద్ధికి తోడ్పడలేదు. 69 ఏళ్ళలో ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలు, లక్షలకోట్ల బడ్జెట్లు బి.సి.ల జీవితాల్లో వెలుగు నింపలేదు. ప్రపంచీకరణ విధానాలలో వెనుకబడిన కులాలు, తరగతులు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నాయి. బి.సి.లు రిజర్వేషన్లూ, సబ్‌ప్లాన్స్‌ వల్ల తమ జీవితాల్లో కాంతిరేఖలు వెల్లివిరుస్తాయనే ఆకాంక్షతో ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నారు.యం.బి.సి.లు. బి.సి.ల్లో అత్యంత వెనుకబాటు కులాల్ని యం.బి.సి.లంటున్నారు. మన రాష్ట్రంలో ఇవి 107 కులాలు. వీరిలో అత్యధిక కులాలు సంచార జీవులు. వీరు నిత్య దరిద్రంలో మగ్గుతున్నారు. మొత్తం బి.సి. జనాభాలో వీరు 30శాతం. ప్రధాన వృత్తి వీధుల్లో చిన్నపాటి వస్తువులు అమ్మడం, కూలి, వాచ్‌మెన్‌ పనులు చేస్తుంటారు. రజకులు, క్షురకులు, కుమ్మర్లవంటి కులాలనూ ఎం.బి.సి.లుగా పరిగణిస్తారు. వీరి అభివృద్ధికి 'బాలకృష్ణ రేనానే' సిఫార్సులను అమలు చేయలేదు. వీరిలో 90శాతం రాజకీయ అంటరానితనంతో ఆందోళన పడుతున్నారు. ఇప్పటికీ చట్టసభల్లో ప్రవేశానికి నోచుకోలేదు.
బి.సి. రిజర్వేషన్‌ అమలుా-లోపాలు స్వతంత్రం వచ్చాక బి.సి.లకు రాష్ట్రంలో 25సం||లకు, కేంద్రంలో 45సం||లకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలయ్యాయి. అయినా అనేక ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికీ రిజర్వేషన్లు పాటించడం ఆర్టికల్‌ 340 క్రింద బి.సి. కమిషన్ని నియమించింది. అయితే బి.సిలకు రిజర్వేషన్లివ్వడానికి సిద్దంగాలేని ప్రభుత్వాలు వీరిని కులపరంగా గుర్తించాలా? ఆర్థికపరంగానా... అని కమిషన్‌ సభ్యుల్లో తలెత్తిన భిన్నాభిప్రాయాలను ఆసరా చేసుకొని నివేదిక తిరస్కరించాయి. రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేశాయి. రిజర్వేషన్‌ అమలుకు స్పష్టమైన విధానం వుండాలని బి.సి.లకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్‌ కల్పించాలని, కోరుతూ పోరాటాలు జరిగాయి. ఫలితంగా జనతా ప్రభుత్వం 1978లో మాజీ యం.పి. బి.సి. మండల్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కమిషన్‌ వేసింది. వెనుకబాటుకు కులాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయిస్తూ మండల కమిషన్‌ 1980లో తన నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రకారం దేశంలో 52శాతం బి.సి.లున్నారు. యస్‌.సి/యస్‌.టి.లకు 22.5శాతం రిజర్వేషన్‌ వుంది. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50శాతం మించకూడదని తీర్పునిచ్చింది. ఆ కారణంగా బి.సి.లకు 27శాతం రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయినా మండల్‌ కమిషన్‌ నివేదికను ప్రభుత్వం ఆపింది. తాము అధికారంలోకి వస్తే మండల కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తామని వి.పి.సింగ్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ 1989 ఎన్నికల సందర్భంగా వాగ్ధానం చేయడం, బి.సి.లు జనతాదళ్‌కు ఓట్లేయడంతో అధికారంలోకి వచ్చిన జనతాదళ్‌ ప్రభుత్వం ఆగస్ట్‌ 17,1990న బి.సి.లకు కేంద్ర విద్యా ఉద్యోగాల్లో 27శాతం రిజర్వేషన్‌ ప్రకటించింది.
మండల్‌ కమిషన్‌ ''విద్య,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు మాత్రమే ప్రకటించింది, ప్రధానమైన రాజకీయ, ఆర్థిక, రంగాల జోలికి అదిపోలేదు. రిజర్వేషన్లు అమలులో వాస్తవ పరిస్థితి పరిగణించకుండా క్రీమీలేయర్‌ కొలబద్ద పెట్టారు. రిజర్వేషన్లు 12శాతం మాత్రమే అమలవుతున్నాయి. ఎఫ్‌.సి.లకు, ఎస్‌.సి.,ఎస్‌.టి. మహిళా రిజర్వేషన్లకు లేని క్రీమీలేయర్‌ తమకెందుకనేది బి.సి.ల వాదన. మరోవైపు ప్రైవేటు రంగం 85శాతం విస్తరించడంతో వున్న రిజర్వేషన్లకే మోసం వచ్చింది. కేంద్రీయ ఉన్నత విద్యాసంస్థల్లో గత ఆరేడేళ్లుగా బి.సి. రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది. కేంద్ర, ఉన్నత సర్వీసుల్లో కేవలం 4శాతం మాత్రమే బి.సి.లు వున్నారు. ప్రమోషన్లలో బి.సి.లకు ఇప్పటికీ రిజర్వేషన్లు లేవు. బ్యాక్‌లాగ్‌ గానీ పోస్టులను బి.సి.లతో భర్తీ చేయడం లేదు. రోస్టర్‌ పద్ధతి సరిగ్గా అమలు కావట్లేదు. గణాంకాలు లేక అభివృద్ధి ప్రణాళిక వేయలేకపోతున్నామని సంఘం చెప్తోంది. సుప్రీం కోర్టు, హైకోర్టు రిజర్వేషన్ల విషయంలో గణాంకాలు కావాలని కోరినా ప్రభుత్వాలు వాటిని సేకరించడం లేదు. సామాజిక న్యాయం దృష్టితో సరిచేయాలంటే బి.సి. రిజర్వేషన్లు ప్రయివేట్‌ రంగానికీ వర్తింప చేయాలి. ప్రభుత్వ రంగంలో కచ్ఛితంగా అమలు చేయాలి.

ప్రభుత్వ విధానాలు బి.సి.లపై ప్రభావం
1.ప్రపంచీకరణ విధానాలతో బి.సి.ల్లో 60శాతం వున్న ఉత్పత్తి, సేవాకులాలు తమ ఉపాధి కోల్పోయారు. వలసల పాలయ్యారు. 25శాతం ఉన్న సంచార జాతులు, విముక్తజాతుల కులాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వినోదాన్ని అందించే కులాలు ప్రభుత్వ అభివృద్ధి విధానాల పరిధిలోలేక కొన్ని కులాలు అభివృద్ధికి నోచుకోలేదు.
2.బి.సి. జన గణాంకాలు లేవు. జ్యోతిరావుపూలే అకాడమీ ఆఫ్‌ బ్యాక్‌వర్డ్‌ కాస్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ సర్వే ప్రకారం ''జనాభాలో 62శాతం కన్నా ఎక్కువ బి.సి. కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన వున్నారు'' అందులో 70శాతం వ్యవసాయ రంగాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తెలంగాణలో (మార్చి 30 వరకు) రైతు ఆత్మహత్యల సంఖ్య 825. వీరిలో 70శాతం బి.సి.లే. వలసల్లో 76శాతం బి.సి.లే. ఆకలిచావుల్లో అత్యధికులూ వీరే.
రాష్ట్ర, కేంద్ర సర్వీసుల్లో, న్యాయ వ్యవస్థ, ఇతర నిర్ణయాత్మక శక్తి కలిగిన సంస్థల్లో బి.సి.ల ప్రాతినిధ్యం 11శాతమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 అసెంబ్లీ, 15 పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను గమనిస్తే 14.9శాతం బి.సి.లు యం.ఎల్‌.ఏ.లుగా 13శాతం యం.పి.లు వున్నారు. ఎం.బి.సి.లు ఒకటీ అరా తప్పలేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ 2012-2013 బడ్జెల్లో 3011కోట్లు బి.సి. సంక్షేమం కోసం కేటాయించింది. మొత్తం బడ్జెట్లో 2.2శాతం మాత్రమే. తెలంగాణాలో సమగ్ర సర్వే ప్రకారం 1.86కోట్ల బి.సి జనాభా ఉన్నప్పటికీ టి.ఆర్‌.ఎస్‌.ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌ లక్షా 15వేల 689కోట్లలో బి.సి. సంక్షేమానికి రు.2172 (1.8శాతం)కోట్లు మాత్రమే కేటాయించింది. బి.సి. అభివృద్ధి కమిషన్‌ రిపోర్టును ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేసాయి. ఇప్పటి వరకు బి.సి.ల మౌలిక సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించలేదు. మార్క్స్‌ ''మెజార్టీ ప్రజలచేతిలో ఆదాయాలు లేక కొనుగోలు శక్తి పడిపోతే ఆదేశ ఆర్థిక వ్యవస్థ తప్పక సంక్షోభంలో కూరుకుపోతుంది. అది మరింతగా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయిస్తుంది'' అని పేర్కొన్న విధంగానే నేడు దేశంలో 54శాతంగా ఉన్న బి.సి.ల కొనుగోలు శక్తి పడిపోతుంది. 

బి.సి. సబ్‌ప్లాన్‌లో ఉండాల్సిన అంశాలు
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల విషయంలో బి.సి/ఒబి.స.ిల జనాభా ప్రాతిపదికన బి.సి సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలి. బి.సి.ల అవసరాలు ప్రాధాన్యతలను అనుసరించి సదరు నిదులను ప్రణాళికబద్ధంగా ప్రతీ సంవత్సరం పున:కేటాయి నిధులను ఎట్టి పరిస్థితుల్లోను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు.
2. క్రింది స్థాయి కులాలకు, వృత్తులకు మరీ ప్రధానంగా అత్యంత వెనుకబడిన తరగతులు (ఎం.బి.సి.లు) సంచార జాతుల కులాలనభివృద్ధికి ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పిస్తూ సబ్‌ప్లాన్‌ రూపొందించాలి.
3.బి.సి.ల కనీస అవసరాలు తీరే విధంగా సరియైన ప్రణాళికలు వేయాలి. ఉదాహరణకు మంచి వసతితో కూడిన నాణ్యమైన రెెసిడెన్షియల్‌ విద్య, ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు, వైద్య సహాయం పూర్తిగా అందుబాటులో ఉండే ఏర్పాటు, ఉపాధి ఉద్యోగావకాశాలు, కనీస దైనందిన ఆదాయం మొదలగు వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.
4 వృత్తిదారుల ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఒక ప్రత్యేక బ్యాంక్‌ ఏర్పాటు చేయాలి.
5. స్త్రీలకు అదనంగా ప్రసూతి వైద్య ఖర్చులు, ఉపాధి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. తల్లితోపాటు పిల్లకు పౌష్టికాహారం అందించే ప్రత్యేక కేంద్రాలను స్థాపించాలి.
 6. వృత్తి కాళాకారులకు సాంస్కృతిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
7. బి.సి. ముస్లిం కులాలకు ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేయాలి.
8. బి.సి. సబ్‌ప్లాన్‌ అమలుకు వీలుగా ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి సంస్థ ఏర్పాటు చేయాలి.
9. ఎస్సీ, ఎస్టీ వేధింపుచట్టం మాదిరి రాజ్యాంగబద్ధంగా ఎం.బి.సి. వేధింపు నిరోధక చట్టం రూపొందించాలి.
10. వివిధ రంగాల మేధావులను, విభిన్నరంగాలకు చెందినవారిని సమావేశ పర్చి వారి అభిప్రాయంతో వివిధ పథకాలు తయారుచేసి, అమలు చేయాలి.  

కుల పోరాటాలే సర్వస్వం కారాదు  
ఇటీవల కాలంలో కులం ఆధారంగా ఓట్లు, సీట్లు, పదవుల పందారాలపై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయా బి.సి.కులాలవారు విడి, విడిగా మహాసభలు జరుపుకుంటు న్నారు. పాలక రాజకీయపార్టీలు, వారి నాయకత్వాలు ఈ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకొనే ఆలోచనలు చేస్తున్నాయి. మేథావులు అనేకులు తమ వాదాలను వివిధ అంశాలవారీగా విశ్లేషిస్తూ, బుద్ధుడు, కారల్‌మార్క్స్‌. అంబేద్కర్‌ల సిద్దాంతాలను పైపైన చర్చించి, బి.సి. కులాల ఐక్యత, రాజ్యాధికార దిశగా ప్రయాణంలో యస్‌.సి., యస్‌.టి., మైనారిటీలతో కలిపి 85% ఓట్లను సంఘటితం చేయాలని తీర్మానిస్తున్నారు. ఆయా కులాల్లోని జనాభా ప్రాతిపదికన సీట్లు (స్థానిక, అసెంబ్లీ, పార్లమెంటు, మొదలగు) కేటాయించాలనీ, అప్పుడు మాత్రమే ప్రజా స్వామ్యపు ఫలితాలు అన్ని కులాలకూ అందుతాయని ప్రకటిస్తున్నారు. యస్‌.సి.,యస్‌.టి. ల మాదిరిగానే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో బి.సి.ల కు సైతం సబ్‌ప్లాను అమలుచేసి, వృత్తులు కోల్పోయిన బి.సి. కులాలవారికి ప్రత్యామ్నాయ ఉపా ధికి, పునరావాసానికి పూనుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.
గతంలో 93 బి.సి. కులాలుంటే ఇప్పుడవి 138 కులాలకు చేరాయి. అదనంగా కలిసిన కులాలు, ఆ కులాలలోని జనసంఖ్యతోపాటుగా మైనారిటీ వర్గానికి 4.5% మొత్తంగా గతంలో ఉన్న 27% రిజర్వేషన్ల నుండే లబ్ది పొందాలని చెప్పడంతో మజ్జిగ పలచనవ్వడమేగాదు, దాని స్వభావం పూర్తిగా కోల్పోయింది. ఇది ఇలా ఉంటే, రజక, మత్స్యకారులు, వడ్డెర, బుడగ జంగాలు మొ|| బి.సి-ఎ కేటగిరిలోని అనేకులు తమను యస్‌.సి.లేక యస్‌.టి లుగా మార్చాలని దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తు న్నారు. ఏమయినా పాలక పక్షాలు మాత్రం తమ సాను భూతిని, సంఘీభావాన్ని పుష్కలంగా ప్రకటించి, చప్పట్లు, కృతజ్ఞతలు, సన్మానాలు భారీగానే పొందుతున్నారు. అభివృద్ధి చెందిన లేక అగ్రకులాలకు చెందినవారు సైతం కుల సంఘాలను రాజకీయాలకతీతంగా స్థిరపరుచుకొని, సంఘటితమవుతూనే ఉన్నారు. వారు విద్యార్ధి వసతి గృహాలు, పారితోషికాలు, ఆయా స్థాయిలలో పరస్పర సహకారం అందించుకునే పద్ధతి కొనసాగుతుంది. సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. తమ సంపాదనలో కొంత భాగం, వారి, వారి కులంలోని పేదలకు అందించుటకు పూనుకొంటున్నారు.వెనుకబడిన కులాలు, వాటి వృత్తులు ధ్వంసం అయి పోయిన, పోతూ ఉన్న క్రమంలో వృత్తులపై ఆధారపడి జీవించేవారి సంఖ్య వేగంగా దిగజారిపోవడం, కొన్ని కులాలు తమ ఉనికిని సైతం కోల్పోవడం(నిర్మూలనకాదు) వారి వారి బంధుగణానికే పరిమితమైన పరిస్థితులు వున్నాయి. తన కులాన్ని బహిరంగ పరచుకోవడం ద్వారా, తనకు ఏవిధమయిన సామాజిక ప్రయోజనం లేకపోగా, న్యూనతా వివక్షతకు గురి చేయబడతామనే భావన కూడా ఉంది. యస్‌.సి.లో వర్గీకరణ గురించి మన రాష్ట్రంలో దశాబ్దానికి పైగా ఆందోళనలు, చర్చలూ, తీర్మానాలు, కమీ షన్‌లు జరిగాయి. ఫలితం వేచిచూడాల్సిందే. ఫలాలు బడుగులకు సమానంగా అందాలంటే, బి.సి.లలో లాగానే యస్‌.సి.లకు కూడా వర్గీకరణ అవసరమనే ప్రజాస్వామిక భావనను దాదాపు అన్ని రాజకీయపార్టీలు ఆమో దించాయి. దీన్ని అమలుచేస్తే వచ్చే పర్యవసానాలపై, పలు కోణాల నుండి విశ్లేషించి, అంతిమంగా దళిత ఐక్యతకు గొడ్డలిపెట్టు అవుతుందనే వాదన కూడా ఉంది. ఇటీవల యస్‌.టి లలో కూడా వర్గీకరణ అవశ్యకత ముందు కొచ్చింది. కొన్ని బి.సి. కులాలు ఇతర కొన్ని రాష్ట్రాలలో యస్‌.సి. లేక యస్‌.టి.లుగా గుర్తించబడగా మన రాష్ట్రంలో సైతం అలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. క్రిమీలేయర్‌(ఉన్నత ఆదాయవర్గం)ను మినహాయించాలనే వాదన కూడా ఉంది. యస్‌.సి., యస్‌.టిలకు లేని క్రిమీలేయర్‌, బి.సిల కెందుకు? అనే ప్రశ్న తలెత్తుతుంది.
చట్టసభల్లో మహిళా రిజర్వేషనుకు సంబంధించిన 33 శాతంలో కూడా వెనుకబడిన తరగతులకు కేటాయింపు ఉండాలనీ, అలా లేనిపక్షంలో అగ్రవర్ణాలకే ఇది ఉపయో గపడుతుందని అభ్యంతరాలు వ్యక్తమయినాయి. రిజర్వేషను లేకుండా 33% మహిళలకు కేటాయిస్తే విషం తాగి చస్తాం అనేదాకా వెళ్ళింది. ఎదో ఒకటి ముందు చట్టం రానివ్వండి, తర్వాతికాలంలో తగిన సవరణలు చేసుకునే వీలుంటుందని అంటే, ఇట్టి సూచన అగ్రవర్ణ అహంకారానికి, బి.సి. వ్యతిరేకతకూ సాక్ష్యంగా ఇల్లెక్కి అరుస్తున్నారు. ఈ విషయంలో పౌర సమాజం, రాజకీయ పార్టీలు, కప్ప -పాము సామెత వంట బట్టించుకుంటున్నాయి.ఎక్కడో మొదలు పెట్టి, ఎక్కడికో చేరి, ఎటూతేలక, చివరికి ఈ కులాలు కనిపెట్టిన వాడెవడో వాడ్ని ఉరి తీయాలని, దులుపుకుంటున్న వైనం తరచూ గమనిస్తూ ఉంటాం. మండల్‌ కమిషన్‌తోనూ ఇతర సామాజికాంశాల నేపధ్యంలో బీహార్‌, యు.పి., రాజస్థాన్‌, తదితర రాష్ట్రా లలో రాజకీయ సమీకరణాల పునాదులుగా కుల సమీకర ణాల అనుభవాన్నించిగానీ, వెనుకబడిన తరగతులు కాని షెడ్యూల్డ్‌ తరగతులలోని అత్యధిక సంఖ్యాకులయిన వారికి అందని ప్రయోజనాలను శాస్త్రీయంగా పరిశీలించడానికి, మేధావులనబడే వారు సైతం వెనుకాడుతున్నారు.
కుల పిచ్చ ఎంతగా ప్రబలిందంటే, చివరికి ట్రేడ్‌ యూనిన్లలోనూ, ఆమాటకొస్తే అన్ని సామాజికాంశాల లోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రగతి నిరోధక పాత్రను పోషిస్తూంది. అంతిమంగా ఇది ఎవరికి లాభం చేకూరుస్తుంది. ఎవరు నష్టపోతున్నారు. దీన్నించి బయట పడటమెలా, అనే దానికి బదులుగా దీన్ని మరింత వికృత పరచడం జరుగుతూంది. ఇటీవల లక్ష్మింపేట దళితుల ఊచకోత దుర్ఘటనలో కూడా, అసలు భూసమస్య పక్కకు బోయి, దళితులు-ఇతరులుగా ముందుకొస్తూంది. లేదా ప్రభుత్వ, పోలీసు వైఫల్యంగా, కుట్రగా మాత్రమే ముందు కొచ్చింది. సంపదలో, ఉత్పత్తి సాధనాలపై ఆధిపత్యంలో కొనసాగుతున్న వివక్ష కారణంగా చుండూరు నుండి లక్ష్మి పేట వరకూ దశాబ్దాలుగడుస్తున్నా మౌలిక విషయాలను నామమాత్రం చేసి, కుల పోరాటాలను నెత్తికెత్తుకొనే వీరులు నయా హీరోలుగా ఆవిష్కరించబడుతున్నారు.
వామ పక్షాలు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలను కులం పాత్రను అంచనావేయడంలో వైఫల్యం చెందారని, కులానికి, వర్గానికి మద్య ఉన్న అవినాభావసంబంధాన్ని చూడ నిరాకరిస్తున్నారని నిందించే దాకా వెళ్లారు. దళిత సంఘాలకు ఆరాధ్య దైవంగా ఉన్న డా|| బి.ఆర్‌.అంబేద్కర్‌ గారి ''కుల నిర్మూలన సిద్ధాంతం''ను, దాని ప్రాధాన్యతను ప్రక్కన బెట్టేశారు. బుద్ధుని, జైనుల, కులరహిత సమాజం, దైవరహిత ఆధ్యాత్మిక సమాజం, ఆదర్శనీయమైన విలు వలతో కూడిన సూత్రీకరణల కాలానుగుణ్యత, అనుభ వాల వెలుగులో వాటి ఆచరణాత్మక ప్రామాణీకతల స్వీయ మానసిక ధోరణుల వెలుపలి నుండి పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించ నిరాకరించడం, నిజంగా బాధాకరమే ! సిద్ధాంత రీత్యా, స్వభావ రీత్యా, కార్యక్రమ ప్రాతిపదికగా బీదలు, దోపిడీకి గురయి రగిలిపోతున్న ప్రజలను, భిన్నకులాలు, మతాలు, ప్రాంతాల వారిని ఐక్యపరిచి వర్గ పోరాటాన్ని, కమ్యూనిస్టు పార్టీల మౌలిక సిద్ధాంతాన్ని వక్రీకరించి, వివిధ కులాల్లోని బీదలను కమ్యూనిస్టుల వర్గ పోరాటాలకు కడు జాగ్రత్తగా దూరం చేయటం వర్గ ప్రయోజనాలను మాత్రమే కాపాడుతుంది. జాతి దోపిడీ నిర్మూలనకు నిర్మాణానికి, కులం ఒక ప్రాధమిక అవరోధ మని, రిజర్వేషన్లు తాత్కాలిక ఊరట మాత్రమే -శాశ్వత పరిష్కారం కాదని చెప్పిన మహనీయుడు అంబేద్కర్‌ని పూర్వ పక్షం చేస్తూ, యధాతధ స్థితిని కొనసాగించేందుకూ, వ్యవస్థలోని నిచ్చెన మెట్లను కొందరు కొనసాగించేందుకు దోహదపడే కార్యాచరణను, అంబేద్కరైట్లు పున:పరిశీలన జరపగలరని ఆశిద్దాం.
మార్క్సిజం ఒక శాస్త్రమని, సిద్ధాంతమని, ఒక విముక్తి మార్గమని అచరించడం సరే, కనీసం విశ్వసించ డానికి భయపడే శక్తులు, వర్గాలు ఉన్నాయి. తమ ప్రయోజనాల రక్షణకు, లాభాల విస్తరణకు పెట్టుబడి సృష్టిం చిన భావజాలం, మార్మిక వాదం, ఆధ్యాత్మికత పేరుతో చేస్తున్న అస్తిత్వవాదం, కర్మసిద్ధాంతం అన్నింటిని కలగా పులగం చేసిన లౌక్యం, కులాల పవిత్రతలు, కులదైవాలు, కులం పేరుతో మహనీయులయిన చరిత్ర పురుషులు, విప్లవకారుల, ఉద్యమకారులపై కపట, నాటకీయ అభిమానాలు, వారి ఫోటోలు, విగ్రహాలు, జన్మదినాలు, వర్థంతులు ఆడంబర నిర్వహణలతో వారి ఆశయాలకు గుత్తదారులుగా అవతారాలెత్తుతున్న దుర్దశ చూస్తున్నాం.
మూల సమస్యలయిన భూ పంపకం, వనరుల్లో వాటా, అధికారంలో వాటా అడగరు. అడిగినా తీర్మానాలకే పరిమితం. ఆచరణలో ఒక్క అడుగు పడిన జాడలేదు. వెర్రి ఎంతగా తలకెక్కిదంటే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ రైతాంగాపోరాటానికి సైతం కులం మకిలి అంటగడుతున్నారు. పోరాడి మరణించినవారు బి.సి.లు, ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు అగ్రకులాల వారని కుల గజ్జిని పోరాటాలకు, త్యాగాలకు, అంటించేం దుకు సైతం వెనుకాడటంలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్య మానికి కూడా ఈ ధోరణిని అతికించే ప్రయత్నం మాన లేదు. రైతాంగ సాయుధ పోరాటానికి, ప్రత్యేక తెలంగాణ సాధనకు లింకు పెట్టి కొనసాగింపు అనే దిశగా వాదనలు, వివాదాలు దిగ్భ్రాంతిని కల్గిస్తున్నాయి. చాకలి ఐలమ్మ, దోడ్డి కొమరయ్య, నల్ల నర్శింలు మొ|| వీర తెలంగాణ సాయుధ యోధులకు, కులం సంకెళ్ళను తగిలించేంతగా తెగిం చారు. అగ్రకులాలలో దోపిడీకి గురి ఔతున్న శ్రామిక జనాన్ని, వెనుకబడిన, దళిత, మైనారిటీలలోని శ్రామిక జనానికి ఉన్న సమస్య ఒక్కటే, అదేశ్రమ దోపిడీ నుండి విముక్తి, శ్రమ విభజన నుండి వర్గ ఐక్యత వైపుగా వీరిని మళ్ళించడం తక్షణ కర్తవ్యం.
కమ్యూనిస్టులకు ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజల కన్నీళ్ళ నుండి, ఓటమి నుండి, పోరాటాల నుండి నిత్యం నేర్చుకునే వారే కమ్యూనిస్టులు. తమ ఔన్నత్యం కంటే తమ తప్పులను సమీక్షించుకుని, ఔనన్నా కాదన్నా వారి వద్దకు వెళ్ళి మమేకం అయ్యేది కమ్యూనిస్టు ఉద్యమమే. మనసమాజంలో కుల వ్యవస్థ ఉనికిని గుర్తించ నిరాకరించ డం గుడ్డితనం. అలాగే వర్గ పోరాట ఆ వశ్యకతను తిరస్కరించడం వెర్రితనం అందుకే ప్రపంచకార్మికులారా !ఏకంకండి !! అనే నినాదం.
దళితుల హక్కులు, ఆత్మగైరవం, ఇంకా కోనసాగు తున్న అంటరానితనం, ఆలయప్రవేశాలు, రెండుగ్లాసుల విధానం, మొ|| సమసలపై తప్పని సరిగా పోరాడవల సిందే. అలాగే బి.సి.ల యొక్క ఆత్మగౌరవం, వివక్షతలు, దాడులను సైతం సంఘటితంగా ఎదుర్కోవాలి. పేరుకు అగ్రకులాలయినా, చారెడు భూమి లేని, ఉపాధి లేని, దయనీమైన జీవనంగడుపుతున్న బీద, బిక్కిజనం తక్కువేమీ కాదు. అందుకే కొన్ని కులాలను బి.సిలో చేర్చాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా గమనిస్తున్నాము. అయితే బీదల్లో ఎక్కువ మంది ఎవరుట? ధనికులలో ఎక్కువ మంది ఏ కులాలవారున్నారు? అధికారంలో ఏఏ కులాలకు ఎంత వాటా? మొ|| అంశాలు నేటి లోపభూయిష్ట ఎన్నికల విధానం కారణంగా, ప్రాధాన్యత సంతరించుకుంటు న్నాయి. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థుల జాబితా నుండి, ఆపార్టీకి వచ్చిన ఒట్ల నిష్పత్తిలో అభ్యర్థులను ప్రజాప్రాతినిధ్య సభలకు పంపే ఏర్పాటు దిశగా చర్యలు తీసుకొవాల్సిన అవసరం ఉంది.

నొమాడిక్ ట్రయిబ్స్, సెమినొమాడిక్ ట్రయిబ్స్
నొమాడిక్ ట్రయిబ్స్, సెమినొమాడిక్ ట్రయిబ్స్, డీనోటిఫైడ్ ట్రయిబ్స్ లను సంచార జాతులంటారు. నొమాడ్స్ అనగా ఒక గుంపు వారి జీవన భృతి గురించి వారసత్వంగా స్థిరనివాసం లేకుండా ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి పోతూ సంచార జీవనం గడపటం. సెమినొమాడ్స్ అనగా కొంత కాలం ఆహార సంపాదన కొరకు అవకాశాలున్న ప్రదేశాలకు వెళ్ళి తిరిగి రావటం. ఈ సెమినొమాడ్స్‌లో పాస్టొరల్ నొమాడ్స్, నాన్ పాస్టొరల్ నొమాడ్స్ అని రెండు భాగాలుగా ఉంటారు. పాస్ట్టొరల్ నొమాడ్స్ పచ్చగడ్డి ప్రాంతాలకు వెళ్ళి జీవాలను మేపుకుంటూ అర్థ సంచార జీవితం గడుపుతారు. నాన్ పాస్టొరల్ నొమాడ్స్ కళలు, వీధి ప్రదర్శనలు, అటవీ ఉత్పత్తుల సేకరణ, నాటు మందుల తయారీ, తట్టలు, బుట్టలు చాపలు అల్లటం, కంచరిపని వంటి వృత్తులు చేస్తారు. ఉదా: యాట,యానాది, కాటిపాపల, గారడి, పైడిమాను, డక్కల, జక్కల, గాండ్ల, హట్‌కర్, దాసరి, పూసల, ఒలియదాసరి, మాస్టీని, ఆరెమరాఠి, తొలుబొమ్మలాట వాళ్ళు, బండ, మొండి, మొండిబండ, బండార, మేదరి/మహేంద్ర, రాజ్‌గొండు, సిక్క్‌లీగర్, కాచి, కైకాడి, పెద్దమ్మలవారు, దేవరవారు, ఎల్లమ్మవారు, ముత్యాలమ్మలవారు, దర్వేష్, దూదేకుల, మోహతర్, ఎర్రగొల్ల, కురుమ, మందుల, బాలసంతు, బహురూపి, బుడిగజంగం, అత్తర్ సాహెబులు, గంగి రెద్దుల, ఫకీర్ సాహెబులు, ఎలుగుబంటి సాహెబులు, జోగి వంటి 40 కులాలు. నొమాడిక్, సెమినొమాడిక్ ట్రయిబ్స్ దేశంలోని అన్ని రాష్ట్రాలలోను, కేంద్రపాలిత ప్రాంతాలలోను ఉండగా, డీనోటిఫైడ్ ట్రయిబ్స్ 16 రాష్ట్రాలలో పంజాబ్, హర్యాన, ఢీల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్‌బెంగాల్, ఒరిస్సా, ఎ.పి, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, గుజరాత్ రాష్ట్రాలలో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో డిఎన్‌టి కులాలు బోయ, వాల్మీకి, బుడబుక్కల, పాముల, బావురి, దండాసి, దొమ్మర, జోగి, కింతల కళింగ, లంబాడి, సుగాలి, ముత రాస, తెలగపాముల, పార్థి, నక్కల, పిట్టల, నిర్సి కారి, పైడి, పిచ్చకుంట్ల, రెడ్డికా, రెల్లీ, వడ్డెర, ఎరుకల, యాట, యానాది మొదలైనవి. ఈ నొమాడ్స్ కులాలు సాధారణంగా ఐదు నుండి 15 కుటుం బాలు కలిసి ఉంటాయి. ఒక పెద్దమనిషి ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి లేదా రెండు దఫాలుగా వచ్చి అందరు కలిసి పండగలు, పెండ్లిళ్లు, పంచాయతీలు, విడాకులు, ఆస్తుల పంపకాలు, గుంపుల విభజన చేసుకుంటారు.
డియన్‌టి అనగా డీనోటిఫైడ్ ట్రయిబ్స్ భారతదేశా నికి ఈస్ట్ ఇండియా అనే బ్రిటీష్ కంపెనీ వారు రాక పూర్వము భారతదేశ రాజులు ప్రైవేటు సైన్యాల ఏర్పాటు పోషణ, రక్షణకు ప్రాధాన్యత ఇచ్చేవారు. వారు కులాల వారీగా వివిధ రకాల సైనిక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసుకొని వారి వారి కులవృత్తితో పాటు సైనిక శిక్షణ, సైన్యా నికి కావలసిన ఆయుధాల తయారీ, సైనిక సామాగ్రి తయారీ తరగతులు నిర్వహిస్తూ రాజులకు విశ్వాస పాత్రులుగా, గూఢచారులుగా ఉంటూ రాజ్యాన్ని శత్రువుల బారి నుండి కాపాడేవారుగా ఉండేవారు. 1821లో బ్రిటిష్ వారు మొట్టమొదట భారత్ తదితర ఆక్రమిత రాజ్యాలలో జనాభా లెక్కల సేకరణ చేపట్టారు. అప్పట్లో ఈ సైనిక శిక్షణ పొందిన కులాలు 200లుగా గుర్తించారు. ఈ 200 కులాలని నాశనం చేయకుండా భారతదేశం మొత్తం ఆక్రమించడం సాధ్యం కాదని గుర్తించారు. అదే సమయంలో 1857లో మొదటి సిపాయిల తిరుగుబాటు జరిగింది. దీనిని ప్రథమ భారత స్వాతంత్ర సమరం అని కూడా అంటారు. 1858 ఆగస్టు నెలలో బ్రిటీష్ పార్లమెంటు వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి భారతదేశ పాలనను బ్రిటిష్ రాణికి అప్పగించారు. అప్పటి నుండి భారతదేశం మొత్తం ఆక్రమించాలనే వ్యూహాలు, ఎత్తుగడలు ప్రారంభించారు. 1887 ప్రథమ భారత స్వాతంత్య్ర సమరంలో తిరుగుబాటు చేసిన రాజులకు సహకరించిన కులాలను, గ్రూపులను అణచడానికి, అదుపులో ఉంచుకోవడానికి పగడ్బందీ వ్యూహంతో “నేరాలను అదుపు చేయాలని సాకు చూపించి క్రిమినల్ ట్రైబ్స్ యాక్టు 1871 చట్టం తెచ్చి ఆయా రాజులకు సహకరించిన కులాలను, గుంపులను భారతదేశం అంతటా “బార్న్ క్రిమినల్స్‌” పుట్టుకతో నేరస్థులు అనే ముద్రవేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ 200ల కులాల వారిని అరెస్టు చేయటం నిర్భంధంలోకి తీసుకోవటం వల్ల ఈ ప్రైవేటు సైన్యాలు గల కులాల వారు సంచార జీవితం, రహస్య జీవితం గడిపే పరిస్థితులు కల్పించారు. ఈ కులాల పేర్ల చివరన దొంగ అనే పదం చేర్చి దొంగ దాసరి, దొంగ దొమ్మరి, దొంగ కొర్చ, దొంగ ఎరుకల, దొంగ వడ్డెరి, దొంగ లంబాడ, దొంగ యానాది, పెద్దింటి గొల్ల గ్యాంగ్, తెలగ పాముల గ్యాంగ్ అని గెజిట్లో ముద్రించారు. గత నేర చరిత్ర లేకున్నా ఆయా కులాల్లో పుట్టిన పాపానికి వారందరూ క్రిమినల్స్‌గా ముద్రపడి ఎలాంటి విచారణ చేయకుండా వారందరినీ సెటిల్ మెంట్ ఏరియా, పర్యవేక్షణ స్థలాలు, జైలు మొదలగు వాటిలో నిర్భంధించారు. వారిచేత రైల్వే పనులు, రోడ్డు పనులు, అడవులలో మొక్కలు నాటడం వంటివి పనులు చేయించారు. అలాంటి పరిస్థితుల్లో ఉండలేక పారి పోయిన వారిని ప్రకటించబడిన నేరస్థులుగా చూపి వారికోసం వెతకటం ప్రారంభించారు. దొరికిన వారిని ఖైదీలుగా ముద్ర వేసి భూస్వాములకు, అగ్రకులాల వారికి, ట్యాక్స్‌లు చెల్లించే వారికి అప్పగించేవారు. వారు వెట్టిచాకిరి చేయించుకొనేవారు. అలా పారిపోయిన వారు తమ కులాల పేర్లు చెప్పుకోలేక ఇతర కులాల్లో కలిసిపోయారు. కొంతమంది మతం మార్చుకోవడం కూడా జరిగింది. కొంతమంది అప్పటి వరకు వారు ప్రయోగించిన యుద్ధ విద్యలను, కళలను వీధి ప్రదర్శనలుగా మార్చుకొని ప్రదర్శించడం, భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసుకుంటూ ఊరూ ఊరూ తిరగడం, స్థిర నివాసం ఏర్పరచుకున్న వ్యవసాయ, వృత్తి కులాల వారికి వారి కులగోత్రాలు, కులగొప్పతనాలు చెప్పుకుంటూ, శైవ, వైష్ణవ దేవుళ్ళు, అమ్మవార్లు, పురాణ పురుషులు, క్షత్రియ రాజుల కథలు, గాథలు వివిధ కళా రూపాల ద్వారా వాయిద్యాలతో పగలు రాత్రి గ్రామాలలో బుర్రకథలు, పటం కథలు, జానపద కళారూపాలు ప్రదర్శించుకుంటూ జీవించటం, అటవీ ఉత్పత్తులు సేకరించి నాటు మందు ల తయారీ, చిన్న చిన్న చెక్క వస్తువుల తయారీ చేసుకుని అమ్ము కోవడం, జాతకాలు చెప్పటం, చేతబడి బాణామతి, అంత్రాలు, మంత్రాలు, తాయత్తులు కట్టడం చేస్తూ, తట్టలు, బుట్టలు, చాపలు అల్లుకుంటూ సంచార జీవితం గడుపుతున్నారు. వీరందరు ప్రత్యేక లిపిలేని భాష మాట్లాడు కుంటారు. ఊరిబయట గుడిసెలు వేసు కొని వారికి వారు ‘పరదేశీలుగా’ పరిచయం చేసుకొని వరుసలు కలుపుకొని సంచార సహ జీవనం చేసుకుంటూ ఇతర కులస్తులను వీరు “మంకాలు”గా సంబోధిస్తారు. అనివార్య పరిస్థితులలో అన్ని రకాల వృత్తులు వీరు నేర్చుకొని వీరికి వీరే స్వయం సేవకులుగా జీవిస్తారు. ఉదా: చాకలి, మంగలి, వడ్రంగి, వెదురుతో పరికరాల తయారీ, వైద్యం, వేట ఆయుధాలు వలలు వీరికి వీరే తయారు చేసుకుంటారు. షోడషకర్మలు మొదలైనవి వీరే స్వయంగా వంశపారంపర్యంగా చేసుకుంటారు. బ్రాహ్మణులను ఆశ్రయించరు. తోటి సంచార జాతుల వారి సహాయం, సలహాలు తీసుకుంటారు.
కొన్ని కులాలు బాగోతుల, బొప్పలవారు, గంజి కూటివారు, శ్రీక్షత్రియ రామజోగి, ఏనుటి, గుర్రపు వారు, అద్దపువారు, కడారి తైదరోళ్ళు, సరగాని, ఓడ్, మాసయ్యలు, పటంవారు, సాధనా శూరులు, రుంజ, పనస, పెక్కర, పాండవులవారు, గౌడజెట్టి, ఆది కొడుకులు, తెరచీరలు, కాటిపడగలు, మందహెచ్చుల, కొమ్ముల వాళ్ళు, ఒగ్గువాళ్ళు, తగురజోగులు, ఆసాది వాళ్ళు, పూజారి, కొర్రాజు, తోటి, పార్థన్‌లు వంటి 50 ఆశ్రిత కులాల వారు సంచార జీవనం గడుపుతున్న ప్పటికీ వారు బిసి, ఎస్‌సి, ఎస్‌టిలలో ఏ జాబితాలోనూ లేక ఒసిలో ఉన్నారు. వారు ఆశ్రయించే కులాలన్నీ బిసి,ఎస్‌సి, ఎస్‌టిలో ఉండగా వారు మాత్రం ఒసిలో ఉండటం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించే వారే లేరు.
1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. అప్పటి జాతీయ కాంగ్రెస్ లోని నాయకులు కూడా ఈ క్రిమినల్ ట్రయిబ్స్ యాక్టు బాధితుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. 1911, 1925లో ఈ చట్టాన్ని ఇంకా పదును పెట్టినా గాని ఎవ్వరు నోరుపెదప లేదు. 1914-1918 మొదటి ప్రపంచయుద్ధం తరువాత 1919లో మాంటేగ్ చమ్సుఫర్డు సంస్కరణలు ఇండియాలో ప్రవేశపెట్టినా ఈ క్రిమినల్ ట్రయిబ్స్ యాక్టు బాధితుల గురించి ప్రస్తావన లేదు. గాంధీ మహాత్ముడు స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రవేశించి నప్పటి నుండి ఏనాడు కూడా ఈ క్రిమినల్ ట్రయబ్ బాధితుల గురించి ప్రస్తా వించ లేదు. 1924లో స్వరాజ్య పార్టీ ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన గాని ఈ బాధితుల గురించి కొన్ని సడలింపులైనా ప్రవేశపెట్టలేదు. 1927లో సైమన్ కమీషన్ ముందుగాని, 1930లో జరిగిన మొదటి, 1931లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలలో గాంధీ మహామ్మ దాలిజిన్నా, అంబేద్కర్ తదితర మహామహులు పాల్గొన్నా ఎవ్వరూ కూడా ఈ యాక్టు మీద స్పందించ లేదు. 1932లో కమ్యూనల్ అవార్డు, 1935లో భారతప్రభుత్వ చట్టం, స్వాతంత్య్రం తరువాత డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్‌చే రచించిన సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం 22 భాగాలు, 395 నిబంధనలు, 9వ షెడ్యూలులో ఈ క్రిమినల్ ట్రయిబ్స్ బాధితుల గురించి ఒక్క లైను కూడా రాయబడి లేదు. అన్ని అణగారిన జాతుల పట్ల అవగాహన ఉన్న డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్‌గారికి ఈ క్రిమినల్ ట్రయిబ్స్ యాక్టులోని బాధితుల గురించి తెలియలేదంటే ఆ విషయం జీర్ణించుకోలే క పోతున్నాము.
ఈనాటి సమాజం, చదువుకున్న వారు, ఇతరులు చాలా మంది ఈ కులాల వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో, పని కల్పించే విషయంలో వారి కులాన్ని దృష్టిలో పెట్టుకొని వెనుకంజవేస్తున్నారు. వీరికి విద్య లేదు, గౌరవంలేదు, కులం పేరు చెప్పుకునే పరిస్థితిలేదు, పని చేసే చోట పెద్దలు, చదివే చోట పిల్లలు తమ కులం పేరు చెప్పుకోలేక అబద్ధం ఆడలేక ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ సమాజంలో కలిసి మెలిసి ఉంటే తమ కులం ఎక్కడ అడుగుతారోనని బిక్కుబిక్కు మంటూ బ్రతికే పరిస్థితి ఈ డిఎన్‌టి కులాల వారిది. 1911లో ఈ చట్టానికి ఇంకా పదును పెట్టి ఈ కులాల వారి వేలిముద్రలు, పాదముద్రలు, ఫోటోలు తీసి భద్రపరిచి వారి భార్య/భర్త/తల్లి/తండ్రి/ పిల్లలు/ బంధువులు/ స్నేహితుల వివరాలు సేకరించి దొరికిన వారిని నిర్బంధం చేయడం, నిఘా పెంచడం వెతికి వెతికి పట్టు కోవడం చేశారు. గ్రామాలలో పోలీస్ పటేల్ అనే అధికారిని పెట్టి వీరు గ్రామాలలోకి వస్తే పోలీసులకు అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. అంటరాని వారు గ్రామాలలో ఉంటూ, వృత్తులు చేసుకుంటూ బ్రతుకు తుంటే వీరు గ్రామానికే అంటరాని వారిగా గ్రామ ప్రవేశానికి నోచుకోకుండా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరైనా గుంపులు గుంపులుగా గాడిదలు, పందులు, కోళ్ళు, కుక్కలు, భార్యపిల్లలతో ఊరు బయట దిగి పోలీస్ పటేలుకు రహదారి పత్రం చూపించి, వారి సామాన్లు జంతువులు లెక్క చూపించి, గుడిసెలు వేసుకొని ఎక్కడ నుంచి వచ్చారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎక్కడికి వెళ్తారు మొదలైన వివరాలు తెలుపుకొని ఉండాల్సిన పరిస్థితి. వారు ఉన్న కాలంలో ఆ గ్రామాలలో ఏ పశువులు పోయినా, ఏ ధాన్యం పోయినా, ఏ వస్తువులు పోయినా వీరే దొంగతనం చేశారని, లేదా ఎవరికైన జబ్బు చేసినా వీరే చేతబడి చేశారని బాధ్యులుగా చేస్తూ పోలీసులకు పట్టించే వారు. ఇలా ఈ కులాల వారిని దారుణమైన అణచివేతలకు గురి చేశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో దాదాపు 20 కులాల ప్రజలు ఈ చట్ట పరిధిలో ఉంచబడ్డారు. బండ, మొండిబండ, బుడబుక్కల, దాసరి, దొమ్మరి, వడ్డెర, ఇరాని, కెంపుమారె, రెడ్డికా, కొరచ, తెలగ, పాముల, పార్థి, నిర్సికారి, సుగాలి, లంబాడి, ఎరుకల, యానాది వీరముష్టి, నెట్టికోతల ఇంకా కొన్ని కులాలు , భారతదేశం మొత్తం మీద దాదాపు 240 కులాలని ఈ చట్ట పరిధిలోకి తెచ్చి అణచివేతకు గురిచేశారు.
1871 నుండి 1953 వరకు దాదాపు 100 సంవత్సరాలు కేవలం ఆయా కులాలలో పుట్టిన వారందరు ఎలాంటి నేరాలు చేయకున్నా, గత నేర చరిత్ర లేకున్నా గాని నేరస్తులుగా ముద్రవేశారు. నూతనంగా బ్రిటీష్ ప్రభుత్వ చట్టాలు ఫారెస్టు యాక్టు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టు, లాండ్ ఎక్విజేషన్ యాక్టు, ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్టు, డ్రగ్స్ అండ్ మేజిక్ రెమిడీస్ యాక్టు, ఎక్సైజ్ యాక్టు, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అండ్ బయోడైవర్శిటి కన్జర్వేషన్ యాక్టు, ప్రివెంటివ్ ఆఫ్ కృయాలిటి టూ యానిమల్స్ అండ్ బర్డ్స్ యాక్టు, రైల్వే యాక్టు, బ్రోతల్ యాక్టు ఇలా అనేక రకాల చట్టాలు తెచ్చి ఈ డియన్‌టి, ఎన్‌టి, ఎస్‌ఎన్‌టి కులాల సంప్రదాయ హక్కులపై వేటు వేసి వారికి జీవనో పాధి లేకుండా చేశారు. ప్రత్యామ్నాయాలు లేక, జీవనాలను పెంచుకొనే అవ కాశం లేక అటవీ వస్తువులు సేకరించే అవకాశం లేక, వేటాడే పరిస్థితి లేక చెరువులు, కుంటల లో చేపలు పట్టే పరిస్థితి లేక తిండికోసం బర్రె, గొర్రె, కోడి, ధాన్యం దొంగిలించి, సారాయి కాచి క్రిమినల్స్‌గా మారే పరిస్థితులు ఏర్పడి నాయి. మహిళలు గత్యంతరం లేక వ్యభిచార వృత్తి చేపట్టే పరిస్థితులు ఏర్పడినాయి.

 ఓబీసీ కేంద్ర జాబితా తెలంగాణ నుంచి 86 కులాల
  ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో కేంద్ర ఓబీసీ జాబితాను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బీసీకులాలను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు వేర్వేరుగా ప్రకటించింది. జస్టిస్‌ ఈశ్వరయ్య నేతృత్వంలోని జాతీయ వెనుకబడిన తరగతుల సంఘం చేసిన సిఫార్సులకు ఈనెల 3వ తేదీన ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. ఇదివరకున్న ఆంధ్రప్రదేశ్‌ జాబితాలో 35 సవరణలు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 86 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చింది. ఇదివరకటి జాబితాలోని వరుస నెంబరు 17లో ఓబీసీల కింద ఉన్న పంబల కులాన్ని జాబితా నుంచి తప్పించింది. ఇదివరకే వీరిని ఎస్సీల్లో చేర్చిన కారణంగా ఓబీసీ జాబితా నుంచి తొలగించింది. అదే విధంగా ప్రస్తుతం వెనుకబడిన తరగతులకు అందుతున్న సంక్షేమ పథకాలకు వీరు అర్హులుకానున్నారు. కేంద్రం ఆమోదించిన తాజా కేంద్ర జాబితాను సామాజిక న్యాయం, సాధికారశాఖ శనివారం గెజిట్‌నోటిఫికేషన్‌లో ముద్రించింది

కుల సంఘాల ద్వారా ప్రగతిబాటలు  
 ఇరవయ్యో శతాబ్దపు మొదటి దశకంలో హైదరాబాద్ సంస్థానంలో నూతన సాంఘిక, సాంస్కృతిక చైతన్యం పెల్లుబికింది. ఆర్యసమాజ్, దివ్యజ్ఞాన సమాజం, బ్రహ్మ సమాజం, ఆది హిందూ ఉద్యమం దళితుల బహుజన వర్గాల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి పలు కార్య క్రమాలు చేపట్టినాయి. దానికితోడు గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర జన సంఘం, ఆంధ్ర మహాసభ పత్రికలు, ప్రజల్లో పౌర ప్రజాస్వామ్య హక్కుల సాధనకు తోడ్పడినాయి. నిజాం నిరం కుశ పాలన, భూస్వామ్య సమాజంలో మెజారిటీ వర్గాలైన బహుజనులు కనీస ప్రాథమిక హక్కులు కలిగి లేరు. వారు ముఖ్యంగా వ్యవసాయదారులుగా, వృత్తి కులాల వారుగా, ఆధిపత్య భూస్వాములకు, ప్రభుత్వ అధికారులకు ఉచిత వెట్టి సేవలు చేసేవారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు బలహీన వర్గాలు, సేవా కులాల వారిని భూస్వామ్య వర్గాలు అనేక రకాలైన వేధింపులకు గురి చేసినారు. వ్యవసాయ రం గంలో జమీందార్లు, జాగీర్దార్లు, మున్నూరు కాపు, ముదిరాజ్ మున్నగు కులాలకు చెందిన రైతుల నుంచి వివిధ రకాల పన్నులు, మామూళ్లు వసూలు చేసేవారు. వ్యవసాయ రంగం లో సంక్షోభం కారణంగా బహుజన కులాలకు చెందిన పేద రైతులు, కులాలు ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు వలస వెళ్లి నారు. ప్రభుత్వ రిపోర్టు ప్రకారం 1920-40 దశకాల్లో తెలం గాణ ప్రాంతం నుంచి పెద్దసంఖ్యలో సూద్ర కులాలకు చెందిన మున్నూరుకాపు, ముదిరాజ్, పద్మశాలి, మేరు దర్జ్జీలు, బొం బాయి, షోలాపూర్, నాగపూర్, బివాండి, సూరత్, అహ్మదా బాద్‌లకు బతుకు దెరువు కోసం వలసపోయినారు.
నిజాం రాజ్యంలో 1920 దశకంలో సంఘ సంస్కరణ సంస్థ లు భాషా సాంస్కృతిక వికాసానికి కృషి చేస్తున్న సందర్భంలో అనేక కుల సంఘాలు ఏర్పడి తమ అస్తిత్వ, ఆత్మగౌరవ, స్వావలంబన ఉద్యమాల్ని చేపట్టినారు. వెనుకబడిన సూద్ర కులాల్లో నిరక్షరాస్యత, పేదరికం రూపు మాపడానికి ఆధునిక విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో కుల సంఘా లు విశేష కృషి చేసినాయి. తమ కుల సమూహాల్లో సాంఘిక దురాచారాల్ని, మూఢ నమ్మకాల్ని రూపు మాపి, ఆర్థిక పరి స్థితుల్ని మెరుగుపర్చి, నూతన చైతన్యాన్ని పెంపొందించడం లో, సంఘటితం చేయడంలో అనేక మంది సంఘ సంస్కర్తలు పాటిపడినారు. బహుజన కులాల్లో ముఖ్యంగా పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజు, గౌడ, యాదవ లాంటి కుల సమూహాల్లో మొదటి తరం విద్యావంతులైన మేధావులు తమ సంఘాభివృద్ధికిఅనేక కార్యక్రమాలు చేపట్టినారు. వారి దృష్టి లో కులాభిమానం, స్వకులాన్ని ఉద్ధరించడం కులతత్వం కాదు. వారి ఆలోచనా విధానంలో స్వకులాభివృద్ధి కోసం కృషి చేయడం సంఘ సంస్కరణ, సంఘ సేవలో భాగమే. వెనుకబడిన తరగతులలోని వారు వివిధ సంఘాలు స్థాపించి, సమిష్టి సంక్షేమం కొరకు శ్రమించడం వారి అభ్యున్నతికి దోహ దపడుతుంది. అందువల్ల తెలంగాణ ప్రాంతంలో బహు జనోద్ధరణత్రయంగా పేరొందిన కొండా లక్ష్మణ్ బాపూజీ, కృష్ణస్వామి ముదిరాజ్, బొజ్జం నర్సింలు చొరవ తీసుకొని కుల సంఘాల్ని స్థాపించి, హాస్టల్స్ నిర్మించి తమ కుల సమూ హాల్లో విద్య, ఉపాధి అవకాశాల్ని పెంపొందించడానికి విశేష కృషి చేసినారు. వారు కేవలం సంకుచిత దృష్టితో స్వకులా భివృద్ధికి పాటుపడలేదు. అంతేకాకుండా తమ జాతి ఔన్న త్యానికి కృషి చేస్తూ, మిగతా బహుజన కులాల పురోగతికి చేయూత నందించినారు. ఉదాహరణకు బొజ్జం నర్సింలు మున్నూరు కాపు ఉద్యమం లోనికి రాక పూర్వమే భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన ఆది హిందూ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించాడు. దళిత సమూహాలతో పాటు వెనుకబడిన బహుజన కులాల పురో గతికి తోడ్పడే సంఘ సంస్కరణ ఉద్యమాలకు నాయకత్వం వహిం చారు.
వ్యవసాయ రంగం తరువాత ప్రా ముఖ్యత కల్గిన చేతి వృత్తి రంగానికి చెందిన పద్మశాలీలు మహారాష్ట్రలో జ్యోతిబాఫూలే నిర్వహించిన సంఘ సంస్కర ణ ఉద్యమంతో ప్రభావితమై నారు. బొంబాయి, షోలా పూర్, పూనే పట్టణాల్లో వల సపోయిన తెలంగాణ పద్మశా లీలు పశ్చిమ భారతదేశంలో చెల రేగిన కుల వ్యతిరేక, సామాజిక ఉద్యమాల స్ఫూర్తితో కుల సంఘా లు, సభలను ప్రారంభించినారు. గుంటక నర్సయ్య పంతులు, హకీం నారా యణ దాస్, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వారు పద్మశాలీ సమాజాభివృద్ధికి ఎనలేని సేవ చేసి నారు. వారి కృషి ఫలితంగా 1930, 40 దశకాల్లో వారు నూతన చైతన్యంతో నిరంకుశ ప్రభుత్వ పన్ను విధానాన్ని, మగ్గం పన్ను, మోతూర్భ, వెట్టిచాకిరి భూస్వామ్య దోపిడిని వ్యతిరేకించినారు. దానితో పాటు తమ కులవృత్తిని పరిరక్షిం చుకొని ఆర్థికాభివృద్ధి సాధించడానికి పద్మశాలి సం ఘం ద్వారా పలు కార్యక్రమాల్ని నిర్వహించి, సంఘటిత ఉద్య మాన్ని నిర్మించడంలో కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహిం చిన పాత్ర కొనియాడదగినది. ఆయన బహుముఖ ప్రజ్ఞా శాలి, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన స్వాతంత్య్ర సమర యోధుడు. రాజకీయ నాయకుడు, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడిగా ఆయన తెలంగాణ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ధీశాలి. నిజాం రాష్ట్రం లో పద్మశాలి, యువజన సంఘాల్ని స్థాపించి, వేలాది మంది చేనేత కార్మికుల్ని సమీకరించి భూస్వాములు, వతన్‌దార్ల నిర్బంధ చాకిరీకి వ్యతిరేకంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో మిలిటెంట్ ఉద్యమాల్ని నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1940 దశకంలో పద్మశాలీ ఉద్య మాన్ని విస్తృత స్థాయిలో వ్యాప్తి చేసి వారి సామాజిక భద్రత, హక్కుల సాధనకు, ఆర్థికాభ్యున్నతికి, విద్యాభివృద్ధికి బహు ముఖ వ్యూహాల్ని ఆవిష్కరించినాడు. ఆయన కృషి ఫలితం గానే హైదరాబాద్‌లోని రాజమొహల్లా ప్రాంతంలో పద్మశాలి హాస్టల్ నిర్మించబడింది. ఆ తరువాత కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి జిల్లా కేంద్రాల్లో పద్మశాలీ వసతి గృహా లను ఏర్పాటు చేసినారు. వాటితో పాటు సంఘాభివృద్ధి కోసం పద్మశాలి సేవా సమాజాలు, పాఠశాలలు, కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు స్థాపించబడినాయి. పద్మశాలీ వసతి గృహాల్లో చదువుకొన్న విద్యా ర్థులు ఉన్నత పదవులు పొంది సా మాజిక మార్పుకు దోహదపడినారు.
మున్నూరు కాపు ఉద్యమ పితామ హుడుగా వర్ణించబడిన బొజ్జం నర్సింలు నిజాం పరిపాలనా కాలంలో సంఘాభివృద్ధికి విశేష కృషి చేసినాడు. 1920 దశ కంలో మున్నూరు కాపు సంఘాన్ని స్థాపించి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ అంశాలపై దృష్టి సారించి కులాభివృద్దికి పాటుపడినాడు. వ్యవసాయ కులమైన మున్నూరు కాపుల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉండటం వల్ల విద్యావకాశాలు పెంపొందించడానికి విద్యాలయాలు స్థాపించి, హాస్టల్స్ ఏర్పా టుచేసి, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు అందించి వారిలో సామాజిక ఆర్థిక పురోభివృద్ధికి మున్నూరు కాపు సంఘం కృషి చేసింది. బొజ్జం నర్సింలు చేపట్టిన సంఘాభివృద్ధి కార్య క్రమాలకు ఆనాటి ప్రముఖులైన సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, రావు బహదూర్ వెంకట రామ రెడ్డిలాంటి వారు తోడ్పాటు నందించినారు. సంఘ సేవతో పాటు నర్సింలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరా టాల్లో పాల్గొని, పలు ప్రజా సంఘాల స్థాపనకు సహాయ సహకారాలందించినాడు. సమాజంలో అణగారిన వర్గాలు, బహుజనులు, మైనారిటీలకు సామాజిక న్యాయం సమకూ రాలంటే వారిని ముందుగా జాగృతి పరిచి, చైతన్యవంతం చేయడం అవసరమని నమ్మిన రాజనీతిజ్ఞుడు బొజ్జం నర్సిం లు. అందుకే విశాల ప్రాతిపదికపై వెనుకబడిన బహుజన వర్గాల ఐక్యతకు, వారి హక్కుల సాధనకు హైదరాబాద్ రాష్ట్ర బ్యాక్ వర్డ్ క్లాసెస్ అసోసియేషన్‌ను స్థాపించి, నాయకత్వం వహించినాడు. సంఘోద్దారకుడిగా, స్వాతంత్య్ర సమరయో ధుడుగా , బహుజనుల ఆశాజ్యోతిగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన తెలంగాణ వైతాళికుడు బొజ్జం నర్సింలు. ముదిరాజ్ జాతి పితామ హుడుగా పేరొందిన కృష్ణస్వామి ముదిరాజ్ స్వకుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేసిన మహోన్నత మేధావి. విద్యావేత్తగా, రచయి తగా, పాత్రికేయుడిగా, పరిపాలనా దక్షుడిగా ఆయన ముదిరాజ్ జాతీయుల్ని చైతన్యవంతుల్ని చేయడానికి నిరంతరం పాటు పడినాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ, బొజ్జం నర్సింలు వలనే కృష్ణస్వామి కూడా ముదిరాజుల సమూహంలోని నిరక్షరాస్యత, పేదరికం, పీడనను రూపు మాపడానికి 1922లో ముదిరాజ్ మహాసభను స్థాపించి నాడు. దాని ఆధ్వర్యంలో కుల ప్రముఖుల నుండి విరాళాలు సేకరించి విద్యానిధిని ఏర్పాటు చేసి ప్రత్యేక హాస్టల్స్ ప్రారంభించి ముదిరాజ్ యువకుల విద్యాభివృద్ధికి పలు కార్యక్రమాల్ని చేపట్టినాడు మహాసభ ఆధ్వర్యంలో.హైదరాబాద్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించి జాతిని ఉత్తేజ పరిచి, ఐక్యపరిచి వారిలోని సాంఘిక దురాచారాల్ని రూపుమాపి, సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందిం చడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ముదిరాజులపై పెత్తందారీ, భూస్వామ్య దోపిడీని వ్యతిరేకించి ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి చైతన్య వంతులైన యువకుల్ని ప్రోత్సహించినాడు. స్వకుల సంఘాభి వృద్దితో పాటు మిగతా అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతికి కూడ ఆయన తోడ్పడినాడు. ఆయన కేవలం ముదిరాజు జాతి ఔన్నత్యానికే కాకుండా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో అనేక వెనుకబడిన బహుజనుల అభ్యున్నతికి కూడ ప్రయత్నించి, మాడపాటి హనుమంతరావు లాంటి వారి సహకారంతో మొదటి హైదరాబాద్ స్టేట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిటీ అనే సంస్థను స్థాపించినాడు. అదే సందర్భంలో యాదవజన సంఘం, మున్నూరు కాపు సంఘం స్థాపనలో తన వంతు సహకారాన్ని అందించినాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక పూర్వం దళిత వర్గాల్లో భాగ్యరెడ్డి వర్మ నిర్మించిన ఆది హిందూ ఉద్యమ స్ఫూర్తితో, 1920 దశకం నుండి బహుజన విముక్తి కొరకు పాటుపడిన త్రయం కొండా లక్ష్మణ్ బాపూజీ, బొజ్జం నర్సింలు, కృష్ణస్వామి ముదిరాజ్ ఆధునిక తెలంగాణ చరిల్రో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో వివక్షకు, దోపిడీకి గురైన అట్టడగు వర్గాలలో నూతన స్ఫూర్తిని, చైతన్యాన్ని పెంపొందించి సామాజిక పురోభివృద్దికి తోడ్పడినారు. వారు నిర్మించిన సంఘ సంస్కరణ ఉద్యమం సంకుచిత దృషి ్టతో కాకుండా, విశాల ప్రాతిపదికపై కొనసాగింది. ఆధిపత్య వర్గాలు, భూ స్వామ్య దోపిడి నుండి విముక్తి కోసం ఆధునిక విద్య, ఉపాధి ముఖ్య సాధనాలుగా ఉపయోగప డతాయని గుర్తించి సంఘాభి వృద్దికి కృషి చేసిన మహనీ యులు. తమ సంఘాల ఔన్న త్యానికి కృషి చేసే క్రమంలో మిగతా వర్గాల వారి సహాయ సహకారాల్ని తీసుకొని కుల సంఘాలు వెనుకబడిన బహుజన వర్గాల సంక్షేమం కొరకు పాటు పడినాయి. 1956 తరువాత విస్తృత స్థాయిలో వెనుకబడిన కులాల ఉద్య మాన్ని నిర్మించడంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర వహించినాడు. ఆయన చొరవ, జొజ్జం నర్సింలు సహకారంతో తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ అసోసియేషన్ బహుజన వర్గాల విముక్తి సాధనంగా రూపొందింది. ఈ మొదటితరం బహుజన ఉద్యమ కారులు వలసవాద, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమా ల్లో పాల్గొని, తద్వార పొందిన అనుభవంతో ఆధిపత్య కుల వ్యతిరేక ఉద్యమాల్ని నిర్మించి తెలంగాణ ప్రాంతంలో బహు జన ఆత్మ గౌరవం, గుర్తింపు అస్తిత్వాన్ని పెంపొందించినారు. ఈ బహుజన త్రయం కృషి ఫలితంగానే 1990 దశకంలో చెలరేగిన మలిదశ వెనుకబడిన తరగతుల ఉద్యమం సాధ్యమైం దని చెప్పవచ్చును.
బహుజన జ్యోతి - భారత ఖ్యాతి
                  ''బహుజన హితాయ- బహుజన సుఖాయ '' అంటూ సకల వివక్షలపై సమరభేరీ మోగించినవాడు బుద్ధుడు. వర్ణ వ్యవస్థపై విలుకాడై దండెత్తి సబ్బండ శ్రామికులకూ సంఘంలో చోటు కల్పించినవాడు బుద్ధుడు. రాజ్యం క్షత్రియ భోజ్యమన్న హిందూ అధర్మాన్ని తిరగరాసేందుకు రాజ్యాన్నే త్యజించినవాడు బుద్ధుడు. మతంగా కన్నా ఒక జీవన విధానంగా బౌద్ధం చరిత్రలో నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకం.విజయానికి పొంగిపోతాం.. అపజయానికి కుంగిపోతాం.. ఆనందం ఆకాశాని కెత్తేస్తుంది.. భావోద్వేగాలు మనిషిని మరబొమ్మను చేసి ఆడిస్తాయి. ఆ ఉచ్చులోంచి తప్పించుకుంటే.. ఎవరైనా బుద్ధుడు కావచ్చు. బుద్ధుడు ఓ వ్యక్తి పేరు కాదు, హోదా అసలే కాదు. ఓ మానసిక స్థితి.
నిజంగా.. అతని మొహంలో ఎంత తేజస్సు! ఆ వెలుగులు మన మీద ప్రసరించాలి. అతడి కళ్లలో ఎంత నిశ్ఛలత్వం. ఆ నిశ్చలత మనల్ని ఆవరించాలి. అతడి నవ్వులో ఎంత స్వచ్ఛత. ఆ దరహాసాన్ని నేను ధరించాలి. అతడిలా అనురాగ ద్వేషాల్ని, ఆనంద విషాదాల్సి, జయాప జయాల్ని, కలిమి లేముల్ని, సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞత మన కుండాలి. మాలో సమ బుద్ధి రావాలి. మనమొక బుద్ధుడు కావాలి.
అటువంటి వారు దాదాపు పాతిక వందల ఏండ్ల కిందట ఈ గడ్డ మీద తిరుగాడిన ఒక మహోన్నత వ్యక్తిత్వం. ఆజ్ఞానాంధకారాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతులను వెలిగించింది. అంతం లేని విషాద గుహాల్లో నివసిస్తున్న మానవ మస్తిష్కాలకు జీవన రహాస్యాలను బోధించి హృదయాలను కరుణార్థం చేసిన వ్యక్తిత్వం సిద్ధార్ధుడిది. చరిత్ర అతన్ని బుద్ధుడు అని పిలుచుకొంది. . కూడళ్లలో బంగారు తోరణాలు కట్టించాడు. నాట్యగత్తెలతో స్వాగత నృత్యాలు.. ఇదంతా చూశాక సిద్ధార్థ గౌతముడు క్రీస్తు పూర్వం 563లో లుంబినీ వనంలో పుట్టాడు. అతని తల్లిదండ్రులు శుద్దోదనుడు, మహామయా. సిద్ధార్థుడు పుట్టిన ఏడు రోజులకే తల్లి చనిపోయింది. పినతల్లి మహాప్రజాపతి పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగాడు. సిద్ధార్థుడు పుట్టుక గురించి అనేక కట్టుకథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఏదీ చరిత్రకు నిలబడేది కాదు. అతడి తండ్రి కోసల రాజు వారి రాజధాని నగరం కపిలవస్తు. వారి రాజ్యం నేపాల్‌కు దక్షిణంగా గంగానది వరకూ వున్న తొమ్మిది వందల చదరపు కిలో మీటర్లు విస్తరించి ఉండేది. ప్రస్తుతం తేరై అని పిలువబడే ప్రాంతమే ఆనాటి సిద్ధార్థుడి వంశమైన శాక్యులు పరిపాలించిన ప్రాంతం.
రాజకుమారుడుగా విలాసవంతమైన జీవితం గడిపిన సిద్ధార్థుడు చిన్న వయస్సులోనే కోళీ రాజకుమార్తె యశోధరను పెండ్లి చేసుకోన్నాడు. వారిద్దరికీ రాహుల్‌ అనే కొడుకు పుట్టాడు. అందమైన భార్య ముద్దులోలికే కొడుకు ఏది కావాలని కోరితే అది అందించేందుకు సిద్ధపడే తండ్రి. చుట్టూ దాసదాసీ జనాంగం సంపదలు, ఎన్నో ఉన్నాయి. బయటి ప్రపంచాన్ని చూడాలని సిద్ధార్థుడు ముచ్చటపడ్డాడు. ఆ చిన్న పాటి విన్నపాన్నీ కాదంటే చిన్నబుచ్చుకుంటాడనేమో.. శాక్య ప్రభువు శుద్దోధనుడు ఘనంగా ఏర్పాట్లు చేసాడు. నగరాన్ని అందంగా అలంకరించాడు. యువరాజు వెళ్లే దార్లో పూలబాటలు వేయించాడుసిద్ధార్థుడిలో ఐహిక భోగాల పట్ల మమకారం పెరగాలి. ఇదీ శుద్దోధనుడి తలంపు. ఎందుకైనా మంచిదని తనకు విశ్వాసపాత్రుడైన చెన్నుడినే సారధిగా పంపాడు. రథం కదిలింది. సిద్ధార్థుడిలో ఆలోచనలూ కదిలాయి. తండ్రి తలచింది ఒకటి కొడుకు చూసింది మరొకటి. అనారోగ్యం, వృద్ధాప్యం, మృత్యువు ఆ సుకుమారుడిని కదిలించాయి. మనిషికి ఎందుకిన్ని దు;ఖాలు? వాటి నుండి బయటపడే దారే లేదా? ఏ మహానుబావుడూ కనిపెట్ట లేదా? అదే కనుక తెలిస్తే, ప్రపంచంలో బాధలే ఉండవు. ఆ సత్యాన్వేషణ కోసం సర్వస్వాన్ని పరిత్యజించాలని నిశ్చయించుకున్నాడు. రాజ్యాన్ని కాదనుకుని భార్య పిల్లల్ని వద్దనుకుని, ఇల్లోదిలి మహాభినిష్క్రమణం చేసాడు.
వేల మైల్లు నడిచాడు. అరణ్యాలు తిరిగాడు. సాదువుల్ని ఆశ్రయించాడు. సిద్ధుల్ని శరుణుజోచ్చాడు. ఎక్కడా సమాధానం దొరకలేదు. హేతువుకు నిలబడని సిద్ధాంతాలూ, ఆడంబరాలకు నిలయమైన ఆధ్యాత్మిక కేంద్రాలు అహానికి ప్రతి రూపమైన గురువులు, పాప పుణ్యాల కథలు, స్వర్గ నరకాలు అతడ్ని సంతృప్తి పరచలేదు. ఇదికాదు. ఇంకేదో వుంది. ఆ పరమసత్యాన్ని తెలుసుకోవాలన్న అంతర్మథనం, సాధన తీవ్రతరం తపస్సు తమస్సును తోలగించింది. బోధి వృక్షం నీడలో సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఆ సారాన్ని శిష్యులకు బోధించాడు. దర్మచక్ర పరివర్తనం! మనో జయమే మహాజయం! మనసును గెలిచిన వాడే అసలైన విజేత మనిషి, మనసు ఈ రెండింటి చుట్టే బుద్ధుడి బోధనలన్ని తిరుగుతాయి. అప్పటి దాకా అందరూ మనిషిని అజ్ఞాని అనో, అల్పుడనో చిన్నబుచ్చిన వారే. తొలిసారిగా బుద్ధుడు మనిషికో గుర్తింపునిచ్చాడు. మానవుడు సకల శక్తి మంతుడనీ సర్వస్వతంత్రుడనీ కితాబిచ్చాడు. ఆకాశం నుంచో మరో వైపు నుంచో అతడ్ని ఏ దైవశక్తో నడిపించడం లేదనీ ఆ తరహా రిమోట్‌ కంట్రోల్‌ వ్యవస్థ సృష్టిలోనే లేదనీ కుండబద్దలు కొట్టాడు. ఎవర్నో గుడ్డిగా నమ్మాల్సిన పన్లేదంటాడు. గురువులైన బోధకులైనా మార్గ సూచి లాంటి వారే మీ దారేమిటో చెబుతారంతే. మీ ప్రయాణం మీరే చేయాలి. మీ కష్టనష్టాలు మీరే భరించాలి. మీకు తెలియాల్సిన పరమసత్యాన్ని మీరే అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి. ఎంత నిజాయితీ. అతనోక చేయి తిరిగిన మానసిక నిపుణుడే.
ఇంటి కప్పుు సరిగా లేకపోతే వాన నీళ్లు ఇల్లంతా కారినట్టు.. ఆలోచనల్లో లోపం ఉన్నప్పుడే మనసులోకి చెడు ప్రవేశిస్తుందంటాడు. ఉత్తమ ఆలోచనాపరుడిని ఏ కామమూ ఏమీ చేయలేదని చెబుతాడు. దు;ఖమే సకల సమస్యలకూ కారణమని తీర్మానించాడు. అలా అని దు;ఖానికి దూరంగా ఏ అడవులకో పారిపోమ్మని బుద్ధుడేప్పుుడు చెప్పలేదు. వైద్యుడు రోగిలోని వ్యాధి లక్షణాల్ని కనిపెట్టి మందిచ్చినట్టు, మనలోని దు;ఖాన్ని మనమే గుర్తించి కారణాల్ని విశ్లేషించుకుని పరిష్కారాన్ని తెలుసుకోవాలని మాత్రమే సలహ ఇచ్చాడు. దు;ఖమంటే.. రోజువారీ జీవితం మనం అనుభవించే కష్టాలో కన్నీళ్లో కాదు. యద్‌ అనిచ్చం తమ్‌ దు;ఖం ఏది అశాశ్వతమో అదే దు;ఖం. సంపదలు ఆశాశ్వతలూ, అధికారాలు ఆశాశ్వతం, యవ్వనం ఆశాశ్వతం. వాటి కోసం వెంపర్లాటే దు;ఖానికి కారణమన్నాడు. హిందూ మత సారాన్ని గ్రహించాడు. తను కోరుకున్నది అది కాదన్నది తెలుసుకోన్నాడు. మాయలు మంత్రాలూ సాధించి మోక్షానికి వెళ్లడమన్నది వట్టి భ్రమేనని తెల్చుకున్నాడు. మనిషి లోపలి అహం 'నేను' అన్న భావనను విచ్ఛిన్నం చేయడానికి సుదీర్ఘ అన్వేషణ చేసాడు. కార్యా కారణ సంబంధాలను తెలసుకోవడానికి దీర్ఘ ఆలోచనా నిమగ్నుడయ్యాడు. ఆరేండ్ల పాటు మస్తిష్కమదనం చేసిన తర్వాత జీవన సత్యాలకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అందులో నాలుగు ప్రాథమిక సత్యాలను శిష్యులకు బోధించాడు.
1, ప్రపంచంలో దు;ఖం వున్నది.
2, దానికి కారణమున్నది.
 3, దానిని తోలగించవచ్చును.
 అందుకు ఎనిమిది సూత్రాలతో ఆచరించవలసిన మార్గమున్నది. ఆ మార్గాల్ని అష్టాంగ మార్గమని పిలిచారు.
 1.హేతువుతో కూడిన సక్రమమైన ఆలోచన(సమ్యక్‌ దృష్టి),
2. ఉన్నత భావాలతో, ఉన్నత ఆశయాలతో కార్యనిర్వహణ చేయడం(సమ్యక్‌ సంకల్పం),
 3. సాటి వారితో సత్యమైన మాటలాడటం(సమ్యక్‌ వాక్కు),
4. నీతి నిజాయితీగలిగిన స్వచ్ఛమైన నడవడికతో ఉండడం (సమ్యక్‌ ప్రవర్తన),
5. ఇతరులను ఆ గౌరవపరచకుండా మంచి జీవితాన్ని గడపడం( సమ్యక్‌ జీవనం),
6. విధి నిర్వహణలో సక్రమమైన పద్దతులను ఆచరించడం(సమ్యక్‌ ప్రయత్నం),
7. ఎల్లప్పుడూ జాగరూకతతో మెలగడం (సమ్యక్‌ జాగ్రత్త),
8. విధులను నియమం తప్పకుండా ఆచరిస్తూ మనసును స్వాధీనంలో ఉంచుకోవడం(సమ్యక్‌ ధ్యానం).
ఇవి బుద్ధుడు సూచించిన అష్టాంగ మార్గము.ఈ మార్గాన్ని ఆవిష్కరిం చడానికి బుద్ధుడు దేశ సంచారం చేసి, సామాజిక రుగ్మతలనూ, మనుషుల బలహీనతలనూ అవగాహన చేసుకుని, ఆధ్యాత్మిక భావనలను తాత్విక చింతనలను తార్కిక దృష్టితో అధ్యయనం చేసి ఎందరి జీవితానుభవాలనో తరిచి చూసి ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కోని, ఎందరితోనో వాగ్యుద్ధాలు చేసి తన సుదీర్ఘమైన జీవితానుభవానికి మేదస్సును జోడించి బౌద్ధధర్మాన్ని రూపొందించాడు. బుద్ధుడు బోధించింది అహింసామార్గాన్నే కానీ, అహింసను కాపాడడానికి హింసా యోగంకూడా తప్పనిసరి అని గుర్తించాడు. కుల, వర్గ, లింగ తదితర వివక్ష లేని సమాజాన్ని స్థాపించేందుకు జీవితాంతం పరివ్రాజకుడై సంచరిస్తూ ధర్మ బోధ చేసాడు.తన ముగ్గురి గురువుల్లో ప్రధముడిగా బుద్ధుడ్ని పేర్కోన్న డా. బీఆర్‌ అంబేడ్కర్‌ 1956 అక్టోబర్‌14న లక్షలాది మంది తన అనుచరులతో సహా బౌద్ధ దీక్షను తీసుకుంటూ తాను బౌద్ధాన్ని ఐదు కారణాల వలన స్వీకరిస్తున్నానని దీక్షాభూమిలో ఇచ్చిన చారిత్రిక ఉపన్యాసంలో వెల్లడించారు.
1. సమానత్వం. వేర్వేరు నదుల్లో నీరు వచ్చి సముద్రంలో కలిసినప్పుడు అది ఎకమై ఒకే నీరుగా మారుతుంది. ఆ విధంగా రకరకాల కులాల నుండి వివాదాల నుండి బౌద్ధంలోకి వచ్చిన వారు కులాలను, అంతస్తులనూ మరిచి ఒకే బౌద్ధ సంఘంలో సభ్యులైపోతారు.
2. దేవుడు పరలోకం, ఆత్మ, కర్మల మీద బౌద్ధానికి విశ్వాసం లేదు. ప్రజలు తమ బాధలను నిర్మూలించుకోడానికి దేవుడి మీద ఆధారపడకుండా స్వయం కృషితో హేతుబద్దమైన మార్గాన్ని అనుసరించడమే బౌద్ధం.
3 ధర్మం అనే పదానికి బుద్ధుడు విప్లవాత్మకమైన అర్థాన్ని ప్రవచించాడు. బౌద్ధంలో ధర్మం అనే పదానికి పూజపునస్కారాలతో, కర్మకాండలతో ఎలాంటి సంబంధం లేదు.
4. బౌద్ధం మతం అంటే ఒక నీతి బాట. ఇతర మతాలకు దేవుడు ముఖ్యమైతే బౌద్ధానికి లౌకిక నీతి ఆధారం, మానవుడని సత్ప్రవర్తనతో, నైతిక శిక్షణతో నడిపించడమే బౌద్ధ ధర్మం.
 5. వర్ణ వ్యవస్థను ఖండించడం, శూద్రులకు, స్త్రీలకు కూడా బౌద్ధ సంఘంలో సమాన స్థాయిని కల్పించడం.
ఈ ఐదు విషయాలే బౌద్ధ మతసారం. హిందూ మతం బౌద్ధ మతాన్ని శత్రువుగా బావించింది. అగ్ని పురాణం బుద్ధుడిని 'గయా సురుడు' అనే రాక్షసుడిగా అభివర్ణించింది. జీవించినంతకాలం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించి క్రీస్తు పూర్వం 483, ఎప్రిల్‌ - మే పౌర్ణమి రోజునయ కాశీకి 120 మైళ్ల దూరంలోని కుశినార అనే ప్రదేశంలో ఆఖరి శ్వాస విడిచాడు. ఆయన జీవించి ఉండగానే ఆయన పట్ల పరమ ద్వేషాన్ని వెళ్లగక్కిన హిందూ మతం ఆయన మరణాంతరం విష్ణువు దశావతారాల్లో ఒక అవతారంగా ప్రకటించి, ఆయన బోధించిన ధర్మంలోకి ఆత్మవాదాన్ని జోప్పించింది. బౌద్ధ ఆరామాల్ని నాశనం చేసి హిందూ దేవాలయాలుగా మార్చి వేసింది. అమరావతిలోని అమరలింగేశ్వర దేవాలయం, విజయవాడలోని కనక దుర్గమ్మ గుడి అందుకు ప్రత్యక్ష తార్కణాలు.
బుద్ధుని నిర్మాణానంతరం, బౌద్ధం మహయన దేవయాన, హీనయాన, వజ్రయాన శాఖలుగా విడగొట్టారు. బ్రాహ్మణుడైన నాగర్జునుడు, తనమాధ్యమిక శూన్యవాదాలను బౌద్ధమతంలోకి ప్రవేవపెట్టాడు. ఎన్నీ వక్రీకరణలు జరిగినా బౌద్ధం ఒక జీవన విధానంగా అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతూనే వుంది. అజంతా, ఎల్లోరా గుహల్లోని శిల్ప సంపద చిత్ర లేఖనం, బౌద్ధం అభివృద్ధి పరిచిన కళాఖండాలే. నలందా, గయ విశ్వవిద్యాలయాలు బౌద్ధ జ్ఞానాన్ని పంచి పెట్టాయి.
ప్రపంచ మతాలలో కెల్ల ఆలోచనా స్వేచ్ఛను ఇచ్చిన మతం ఒక్క బౌద్ధమతమే. ప్రతి మతం తన ప్రాథమిక అంశాలను ప్రశ్నించే వీలు లేదంది. అలా ప్రశ్నించే వీలు లేదనడమే దాని బలం, బలహినత. ఎలాగంటే దాని ప్రాథమికాంశాలను (ఉదా. దేవుడున్నాడనే ప్రాథమికాంశాన్ని ప్రశ్నిస్తే దాని దగ్గర సమాధానం లేదు. అది దాని బలహినత ప్రశ్నించే హక్కు లేదనడం దాని బలం). బౌద్ధం పద్ధతి ఇది కాదు. వచ్చిన సమాధాన్ని తప్పక అంగీకరించి తీరవలసిన ఆవశ్యకత లేదు. ఆ వచ్చిన సమాధానాన్ని కంసాలి గీటురాయి మీద గీసి బంగారం వన్నేను ఎలా లెక్కగడతాడో.. అలాగే తన అనుభవరాసితో బేరీజు వేసుకొని దాని విలువ కట్టాలి. ఈ విధంగా బౌద్ధం స్వేచ్ఛా చింతనాన్ని పరిమితిస్తుంది. స్వేచ్ఛ చింతనం అంటే హద్దులు లేని స్వైర కల్పన కాదు. పిచ్చి ఆలోచన అసలే కాదు. అది హేతుబద్దంగా ఉండాలి. శాస్త్రీయంగా ఉండాలి. వివేచనకు నిలవాలి. అందుకే బుద్దిహినులకు బౌద్ధంలో చోటు లేదన్నడు ఒక పెద్దమనిషి.
తెలుగు గడ్డ మీద ఒకప్పుడు బౌద్ధ ధర్మం విలసిల్లి సమతా పరిమళాలను వెదజల్లింది. పెరిగిన శాస్త్ర విజ్ఞానాన్ని, మారిన కాలాన్ని మానవ విముక్తి ఉద్యమాల్ని ఆవిష్కరించింది. సాంస్కృతిక విలువలు పంచింది. మనం సమసమాజ నిర్మాణానికి పూనుకోవాలి. చనిపోయేముందు బుద్ధుడే ''బిక్షులారా.. నా మీద భక్తితో నేను చెప్పిన మాటల్ని యధాతథంగా స్వీకరించవద్దు. తర్కం అనే గీటు రాయి మీద దాన్ని పరీక్షించి ఆ తర్వాతనే స్వీకరించండి'' అని చెప్పాడు. ఆయన బోధించిన గతితర్కం బౌతిక వాదం ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా అన్వయించుకోవాలి.  

తత్వశాస్త్రాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన బౌద్ధం

                   బ్రాహ్మణులే బ్రహ్మకు నిజమైన సంతానమని, అతడి నిజమైన వారసులమని, బ్రహ్మ నోటి నుండి పుట్టారని వాదించిన వారిని బుద్ధుడు పరిహసించాడు. ''ఇలా చెప్పుకుంటూ తిరిగే బ్రాహ్మణులు తమ భార్యలవలె తమ తల్లులు కూడా సంతానవతులేనని, వారు కూడా పిల్లల్ని కని పెంచడం వలనే తాము వచ్చామని ఎలా మరచిపోతున్నారు.? బ్రహ్మ నోటి నుండి వచ్చామంటూ ఎలా చెప్పుకోగలుగుతున్నారు?''
మరి నాలుగు కులాలు ఉనికిలో ఉన్నమాట నిజమే కదా? అవి ఎలా వచ్చాయి? అని అడిగిన వారికి బుద్ధుడీ విధంగా సమాధానం చెప్పాడు. ''భూమి మీద నీరు ఇంకి మట్టి తేలిన తర్వాత మొదట్లో పుట్టగొడుగులు వంటివి పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత క్రమంగా నేలపై పాకే తీగలు, చిన్న చిన్న మొక్కలు, తర్వాత చెట్లు పుట్టుకొచ్చాయి. ఈ సమయంలోనే పుట్టుకొచ్చిన జీవులు క్రమంగా మనిషి రూపం పొందాయి. వీరికి భూమి మీద ఉన్న మొక్కల చివరనున్న ధాన్యం లభించింది. దానిని తీసుకుపోయి తిని కడుపు నింపుకొని మర్నాడు వచ్చే సరికి మళ్లీ ధాన్యం పుట్టుకొచ్చింది. ఇలా ఆకలి కలిగినప్పుడల్లా వచ్చి ధాన్యం సేకరించుకుపోతున్న మనుషుల్లో కొందరికి బద్ధకం పుట్టింది. ఆకలేసిన ప్రతీసారీ వచ్చి ధాన్యం సేకరించుకుపోయే కంటే ఒకే సారి ఎక్కువ ధాన్యం తీసుకుపోయి దాచుకుని తినవచ్చు కదా అన్న ఆలోచన ఆ బద్ధకం నుంచి పుట్టింది. అదే స్వార్థానికి దారి తీసింది. దాని నుంచే ఆచారాలు పుట్టాయి. భూములకు హద్దులు, హక్కులు వచ్చాయి. ఈ దొంగతనం, అబద్దాలు ఆడటం వంటి తప్పుడు బుద్దుల్ని అరికట్టడానికి, తప్పుచేసిన వారిని శిక్షించడానికి మనుషులు తమలో ఒకరిని ఎన్నుకుని అతడికి అధికారం ఇచ్చారు. అలా శిక్షించే పని చేస్తున్నందుకు అతనికి తమ ధాన్యం నుండి కొంత వాటా ఇచ్చారు. ఆ విధంగా తమలోని అత్యంత సమర్థుడైన వాడిని మానవులే ఎన్నుకుని అతడిని రాజుగా చేసారే తప్ప ఏ దేవుడూ కులాల్ని సృష్టించలేదు. మానవుల్లో కొందరు తమంతట తామే అబద్ధాలాడటం, దొంగతనం చెయ్యడం వంటి తప్పుడు పనులకు దూరంగా ఉండాలని, మంచి పద్ధతిపై మనసు లగం చెయ్యాలని పూనుకున్నారు. ఆ విధంగా ధ్యానలో నిమగమై ఉన్నవారే బ్రాహ్మణులు. మరొ కొందరు వివాహ జీవితం చేబట్టి వ్యాపారం చెయ్యడం ప్రారంభిం చారు. వారే వైశ్యులు. మిగిలిన వారు తొలిరోజుల్లో వేట ద్వారా జీవనం సాగించే వారు. వీరే శూద్రులు.
బుద్ధుడు కులవ్యవస్థ రూపొం దించిన తీరు గురించి చెప్పింది సరిగాకపోయినా, కుల వ్యవస్థ మొదటి నుంచీ, అనాదిగా ఉన్న ఏర్పాటు కాదని, ఇది భగవం తుడి నిర్ణయం కాదని, ఏ మార్పుకీ వీలులేని వ్యవస్థగా కుల వ్యవస్థను చూడరాదని బుద్ధుడు తన వివరణ ద్వారా నిర్థారించగలిగాడు. భగవంతుడిని తిరస్కరించడమేగాక 'ఆత్మ' అనే భావనను కూడా బుద్ధుడు తిరస్కరించాడు. శరీరం నశించినా ఆత్మకి చావులేదని, అది పరమాత్మలో భాగమని, ఈ ఆత్మ శరీరం నశించాక మరో శరీరంలోకి ప్రవేశించడమో లేక పరమాత్మను చేరుకోవడమో జరుగుతుందని భావవాదులు ఉపనిషత్తులలో చెప్పిన వాదనను బుద్ధుడు నిర్ద్వందంగా తిరస్కరించాడు. ఈ క్రమంలో 'ప్రతీత్యసముత్పాదం' అనే సూత్రాన్ని ప్రతిపాదించాడు. ఆత్మను పూర్తిగా తిరస్కరించడం ద్వారా బౌద్ధం తక్కిన మతాలన్నింటికన్నా విభిన్నమైన విశిష్టతను సంతరించుకుంది. 'ప్రతీత్సముత్పాదం' ఒక గతి తార్కిక సూత్రం. ఈ విశ్వంలో ప్రతీదీ నిరంతరం మారుతూనే ఉంటుంది. అసంఖ్యాకమైన మార్పుల సముదాయమే మనకు గోచరించే ప్రపంచం. ప్రతీ మార్పుకీ కారణం, కారణాలు ఉంటాయి. ఈ మార్పు తిరిగి మరొక మార్పుకి, మరి కొన్ని మార్పులకు కారణమౌతుంది.'' అన్నది దాని సారంశం. ప్రతీదీ నిరంతరం మారేటప్పుడు శాశ్వతమైనది ఏదీ ఉండడం అసాధ్యం. కాబట్టి శరీరం నశించాక ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశించడం అనేది ఊహీజనితమే తప్ప వాస్తవం కాదు. అదే విధంగా ఆత్మ స్వర్గమో, నరకమో చేరుకోవడం అనేది బూటకం. ఆత్మకు శాంతిత చేకూర్చడానికి కర్మ కాండలు చేయమనడం బూటకం. ఈ విధంగా వివరించి బౌద్ధం అనాత్మవాదం అన్న పేరు తెచ్చుకుంది.
 
 

 కులం పై వార్‌ - కబీర్‌

మృత్యువును ఒళ్ళో పడుకోబెట్టుకొని జీవ రహస్యాలు బోధించడం కదా జీవితం. లిప్తలు లిప్తలుగా కరిగిపోయే కాలమై లయించి ఒక సంపూర్ణత్వంలోకి ప్రవహించే నిరంతర యాత్రకదా జీవితం. పుట్టుకకూ చావుకూ మధ్య మనిషితో కాలం ఆడే దాగుడు మూతల దోబూచులాట కదా జీవితం. ''తల్లి గర్భం నుండి శ్మశానం దాకా సాగే ఊరేగింపు'' కదా జీవితం. మనిషి మరణం అతను జీవించిన పద్ధతిని వివరిస్తుంది. అందుకే బతకటానికి చావడం నేర్చుకోవాలి. చావుకు తెగించి బతకడం నేర్చుకోవాలి. బతుకును కబళించడానికి అడుగడుగునా పొంచియున్న చావు సంస్కృతిని కూల్చడం నేర్చుకోవాలి. కబీరుకు ఆ రహస్యం తెలుసు.
''హరినెందుకు బ్రేమింతువు?
హరిజనులను బ్రేమింపుము
హరి నీకు విత్తమిచ్చును, రాజ్యమిచ్చును
హరిజనులు 'హరినే' యిత్తురు ''
 
హరికంటే హరిజనుడు పెద్దయని తలుపుము. జగము హరి యందు గలదు. 'హరి' హరిజనుని యందు గలడని కబీర్‌ అనేను. ''జన్మతో శూద్రులే పుట్టినారు. జందెములు కృతిమములు మీరు పుట్టువుతో బ్రాహ్మణులై వచ్చినారా? అట్లైనా వేణోక మార్గమున ఎందుకు వచ్చి యుండరాదు?
... మీరు తురకలుగా బుట్టినారా? అట్లైనా కడుపునే యేల సున్నతి జేయించుకొని రాలేదు?
''నల్లని యావును బిండుము. తెల్లని యావును బిండుము. పాలలో భేదమున్నదేమో చూడుము..'' అని తీవ్రమైన స్వరంతో కులమత విద్వేషాన్ని ప్రశ్నించారు కబీరు.
.. ఎమ్ములొకటి. చర్మమొకటి.
మాంస మొక్కటి. మలమూత్రము నొక్కటి. గుదమొక్కటి. ముద్ర యొక్కటి. ఒకే బిందువు నుండియే సృష్టి జరిగినది. బ్రాహ్మణుడెవడు? శూద్రుడెవడు?'' అని కబీర్‌ కుల బేదాలపై సూటిగా దాడి చేసారు. (చూడండి 'కబీర్‌ వచనావళి')
''అనాది నుండి ప్రపంచం మరణిస్తూనే వుంది
అయినా ప్రపంచంలో ఎవరికీ
ఎలా మరణించాలో తెలియనే లేదు...
మళ్లీ మళ్లీ మరణించాల్సిన అవసరం లేని విధంగా
చనిపోవడం నేర్చుకున్నాడు కబీరు...''
ఈ మాటలు కబీరు తనను గురించి తాను చెప్పుకున్న కవితలోనివి, ఎలా చని పోవాలో తెలుసుకున్న మనిషి ఎలా జీవించాలో తెలుసుకుంటాడు.
 
దళిత విముక్తి తత్వాన్ని ఆవిష్కరించిన డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తన గురుత్రయంలో కబీరుని ఒకరిగా పేర్కోన్నారు. ''ఎన్నెన్నో మాయలు చేసిన వాళ్లు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా.. మంచి మనిషిగా బతకడమే కష్టమైన విషయం'' అన్న కబీరు సూక్తే అంబేడ్కర్‌ మంచి మనిషిగా బతకడానికి ప్రేరణ. మంచి మనిషిగా బతకడం అంటే చేడు మీద తిరుగులేని పోరాటం ప్రకటించి మానవతా విలువలను ప్రతిష్టించడం. దారి పోడవునా పాతుకున్న శిలువల్లా మృత్యు విలువలు మనిషిని ప్రతి నిమిషం కబలిస్తూ మృతప్రాయుడిగా మారుస్తున్నప్పుడు ఆ మృత్యు విలువలను సమూలంగా నిర్మూలించడానికి చావుకైనా సిద్దపడి పోరాడటమే జీవించడం అంటే. దుర్మార్గపు పరిస్థితులకు లొంగిపోయి బతకడం మరణంతోనే సమానం. వాటినెదుర్కోంటూ మరణించినా అది అమరత్వమే. ఇదే కబీరు మన సమాజానికిచ్చిన సందేశం. కబీరుకు మరణించడం ఎట్లా తెలుసు అందుకే జీవించడం ఎట్లాగో తెలిసింది.
కబీర్‌ భక్తి ఉద్యమకారుడే. భక్తి పేరుతో కొనసాగుతున్న దారుణమైన దుర్మార్గాల్ని ఎండగట్టి భక్తి పేరుతోనే భక్తిలోని మూఢత్వంపై విరుచుకుపడ్డారు. త ద్వారా మానవతావాద స్ఫూర్తిని అందించారు కబీర్‌. అందుకే ఆయన సందేశం మనకు ఆదర్శప్రాయం. భక్తి అనే టెంకను పడేసి మనం కబీర్‌ ప్రభోదించిన మానవతావాదం అనే గుట్టును స్వీకరించాలి. హిందూమతంలోను, ఇస్లాం మతంలోనూ గూడుకట్టుకున్న క్రౌర్యానికి వ్యతిరేకంగా ఆయా మతాల నుండే సంస్కరణ భాషలో భక్తి ఉద్యమాలు ఉద్భవించాయి. దుర్మార్గపు మూఢాచారాల మీద, పురోహితుల స్వార్థ చింతన మీద పోరాటం ప్రకటించి, కులాన్ని నిర్మూలించి, కులాన్ని నిరాకరించి, అస్పృశ్యతను నిర్మూలించేందుకు, మానవ విలువల్ని ప్రతిపాదిస్తూ భక్తి ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఆ భక్తి ఉద్యమాల్లో అత్యున్నత స్థానానికి చేరుకున్న వాడు కబీరు. బ్రాహ్మణవాద హిందూ సమాజం పరమకర్కశంగా సగటు భారతీయ జీవితాన్ని చిధ్రం చేస్తున్నప్పుడు, మనిషిపైకి మనిషిని ఉసిగోలిపి అమానుష విద్వేష జ్వాలాల్ని చేలరేపుతున్నప్పుడు, మతం పేరుతో కులవ్యవస్థ పేరుతో భయానక దారుణాలు అధికారికంగా సాగిపోతున్నప్పుడు సమాజానికి పరస్పరం ప్రేమించే గుణాన్ని నేర్పినవాడు కబీరు.
 
పాపాత్ముడూ, పుణ్యత్ముడూ రాల్చే కన్నీళ్లకు తేడాలేదు. ప్రేమ పూరిత హృదయం రక్తాశ్రువుల్ని రాలిస్తుంది'' అంటూ తన ద్విపద కవితల ద్వారా రక్తచలన సంగీతాన్ని వినిపించిన వాడు కబీరు. స్మరించింది రామనామాన్నే. అయితే ఆ రాముడు హిందువులు పూజించే రాముడు కాదు. కబీరు విగ్రహారాధననూ, హైందవాచారాలనూ ద్వేషించాడు. మనుష్యులందరూ సమజీవనం చేయాలనే, ప్రేమతో మెలగాలనీ, మనషుల్లో మానసిక పరివర్తన అవసరమనీ, ''నిర్గుణ భక్తి'' మార్గాన్నీ కబీరు ప్రతిపాదించాడు. ఈ మార్గానికే ఆయన రామనామస్మరణ పేరు పెట్టుకున్నాడు. ఇందులో ప్రేమ, విరహం ప్రముఖంగా ఉంటాయి. ఈ మార్గంలో సమాజ పరివర్తన చేయడానికి ఆయన ''సురటి యోగం'' అనే నూతన విధానాన్ని రూపొందించాడు. వైదిక విది నిషేదాలనూ, మత నియమాలనూ లెక్క చేయకుండా సరళమైన జీవితాన్ని గడపడమే సురటియోగం. ఈ జీవన విధానానికి, ప్రచారానికి ఆయన పూనుకున్నాడు. కవితల ద్వారా ప్రచారం నిర్వహించాడు. ఆ కవితల్లో సాంద్రత జీవితాన్ని ప్రతిఫలించే తత్వం ఉంది. ఏ విషయాన్ని గురించి చెప్పిన ఆయన తర్కం అ సమానమైనదిగా ఉంటుంది. ఆయన జ్ఞానం పదునైన ఖడ్గంలా మెరుస్తుంది. భయరహితమైన, స్వతంత్రమైన, సంప్రదాయ వ్యతిరేక ధోరణి ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కబీరు ముస్లిం మతానికి చెందినప్పటికి చేనేత వృత్తి ఆధారంగా జీవించే కుటుంబంలో పుట్టాడు. హిందూ అగ్రవర్ణ సమాజంలో పుట్టుకరీత్యా అట్టడుగు వర్గం వాడు. పుట్టిన తేది, తల్లిదండ్రుల గూర్చి ఆనేక రకాల కథలు ప్రచారంలో వున్నాయి. అనేక రకాల ఆధారాలను పరిశీలించిన మీదట 1455 ప్రాంతంలో కబీరు జన్మించి ఉండోచ్చని ఒక అంచనా. తల్లిదండ్రులు వీరు, వీమా దంపతులని అంటారు. వాళ్లకు కబీరు ఎక్కడో దొరికాడనీ, వాళ్లు తెచ్చుకొని పెంచారని వాదన. ఈ వాదోపవాదల మధ్యలో పుక్కిట పురాణ కల్పనకి అవకాశం ఉండనే వుంది. కబీరుని భగవంతుని అవతారంగా ప్రచారం చేసి ఇప్పుడు అనేక చోట్ల గుడులు కట్టారు. ఎన్నో మహత్యాలను వూరురా ఆపాదించారు. హిందూ వర్ణ శ్రమధర్మం తనకు వ్యతిరేకంగా నిలబడిన వారిని నాశనం చేయడమో, కుదరకపోతే స్వంతం చేసుకొని తమ ధర్మంలో అంతర్భాగమేననీ ప్రచారం చేసి ఆ పోరాట స్ఫూర్తిని జీవరహితం చేయడమో చేస్తూ వచ్చి ంది. వైదిక మతం మీద తిరుగు లేని పోరాటం చేసిన బుద్ధిణ్ణి విష్ణువు దశావతారల్లో ఒకటిగా ప్రచారం చేసినట్టు వైదిక ధర్మానికి వ్యతిరేకంగా బోదనలు చేసి ప్రజా బాహుళ్యం అభిమానాన్ని చూరగొన్న వారందరిని తమ ముక్కొటి దేవతల్లో ఎవరో ఒకరిగా అవతారంగా ప్రచారం చేసారు. దానికి అనుకూలంగా ఒక పుక్కిటి పురాణాన్ని సృష్టించడం హిందూధర్మంలో అనవాయితీయే. కబీరు గూర్చి అనేక పుక్కింటి పురాణాలు పుట్టి ప్రచారమయ్యాయి.
 
నిజానికి కబీరు ఇస్లాం మతానికి చెందినవాడు. అప్పటి ముస్లిం పాలకులు హిందూ పాలకుల్లాగానే పరమత సహనం లేని సంకుచితత్వంలో కూరుకుపోయారు. ఈ కారణంగా ఇతర మతస్థులను హింసించడం చేసేవారు. మతచాందస భావంతో ఇతరులను క్రూరంగా హింసించడాన్ని కబీరు తీవ్రంగా నిరసించాడు. హిందూకర్మకాండల్ని, మతం పేరుతో జరుగుతున్న ఆరాచకత్వాన్ని ఎండగట్టారు. ఆరోజుల్లో మత గురువులు పరాన్నభుక్కులుగా నాలుగు దేవుడు మాటలు చెప్పి తమ పబ్బం గడుపుకోవడం, యాచన చేసి సుఖభోగాలను అనుభవించేవాళ్లు. ఆశ్రమాల నిర్వహణ పేరుతో రాజుల నుంచి ధనరాశుల్ని పొందేవారు. కర్మకాండల పేరుతో ప్రజల రక్తాన్ని పిల్చిపిప్పిచేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో గురువు సోమరిగా వుండరాదనీ, శ్రమ చేయాలనీ భోదించి తాను స్వయంగా మగ్గం వేసి వచ్చిన ఆదాయంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు కబీరు.
ముస్లింగా పుట్టి హిందువుల దేవుడైన రాముణ్ణి స్మరిస్తున్నాడనీ ఆయన మీద ముస్లిం చాందసవాదులు కత్తిగట్టారు. రాముడ్ని స్మరిస్తూ రాముడికి వ్యతిరేకంగా హిందూ విధానాలను తూర్పార పడుతున్నాడనీ హిందువులు ద్వేషించారు. పాలకులు ఆయన్ను చిత్రహింసలు పెట్టారు. అయినా తాను నమ్మినా విషయాన్ని చివరిదాకా బోధ చేస్తూనే బతికారు. వారి వద్ద హిందువులూ, ముస్లింలూ శిష్యులుగా ఉండేవారు.
మనిషి స్వార్థాన్ని ఎత్తి చూపుతూ ''ఇంత పెద్ద గోడలతో ఎందుకంత విశాల భవనాన్ని నిర్మిస్తావు? ఆరడుగుల చోటు నీకు సరిపోతుంది కదా!'' అంటాడు కబీరు. హిందూ ముస్లింలనూ దృష్టిలో పెట్టుకొని రామరామ అంటూ హిందువులు మరణిస్తారు. ఖుదా పేరు తలచుకుని ముస్లింలు తనువు చాలిస్తారు. ఇద్దరికి దూరంగా ఉన్నవాడే జీవిస్తాడు అంటాడు కబీరు. జీవన విషాదాన్ని ప్రతిబింబిస్తూ ''వీణ ఇక మిటదు... తీగలన్నీ తెగిపోయాయి'' అంటాడు. కానీ పాపం వీణను దూషించడమెందుకు వాయించే వ్యక్తి వెళ్లిపోయాక.. అని గుర్తు చేస్తాడు కబీరు. జీవితంలో కానవచ్చే వైచిత్రీ, వైవిద్యాలను తలచుకొంటూ ఆక్రందలోనే గానం గానంలోనే ఆక్రోశం.. సన్యాసి సంసారి అయ్యాడు. సంసారి వైరాగ్యంతో జీవిస్తున్నాడు'' అని అచ్చెరువొందుతౌడు. కుల వివక్షనూ, మతంలోని కాపట్యాన్ని వివరిస్తూ కలియుగంలో ఆయన కలామాను బోదించినవాడు ఆయన నిజతత్వాన్ని శోదించలేకపోయాడు. వేదాలూ, ఖూరానూ కూడా శుష్కమైనవే. ఆయన మర్మం హిందువులకూ, ముస్లింలకూ ఎవరికీ తెలియదు. ఇద్దరూ తప్పులలో కాలు వేసి అదే మతం అంటున్నారు. గాలితో, నీటితో ఈయన లోకాన్ని సృజించాడు. ఈ జగత్తు శూన్యంలోనే అదృష్యమైపోతున్నది. అప్పుడు కులాల ప్రసక్తి ఎవరు ఎత్తుతారు'' అని ప్రశ్నిస్తాడు. ఈ విధంగా తన కవితా కరవాలలతో సామాజిక రుగ్మతలమీద తిరుగులేని యుద్ధం ప్రకటించిన కబీరు 1505లో ''మషుర్‌''లో చనిపోయాడు. ఆ చనిపోవడంలో కూడా కబీరు తిరుగుబాటుతత్వమే కనిపిస్తుంది. మషుర్‌లో చనిపోయిన వారికి మోక్షం ఉండదని హిందువుల నమ్మకం. ఆ నమ్మకానికి మూలాధారం పురాణాల్లో వుంది. పూర్వకాలంలో దక్ష ప్రజాపతి మషుర్‌ పట్టణంలో యజ్ఞం చేసి శివుణ్ణి ఆహ్వనించలేదు. తన భర్తను అవమానించినందుకు సతీదేవి ప్రాణ త్యాగం చేసింది. అది తెలిసి ఉగ్రుడైన శివుడు ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయమని ప్రమధగణలను ఆజ్ఞాపించాడు. మషుర్‌లో మరణించినవారు గాడిదలై పుడతారని శపించాడు. అందువల్ల ఎవరూ మషుర్‌లో మరణించడానికి ఇష్టపడరు. కాశీ పుణ్యక్షేత్రం కాబట్టి చనిపోయే ముందు కాశీ చేరుకొని అక్కడ మరణించాలని కోరుకుంటారు. ఈ మూఢ విశ్వాసాన్ని నిరసించడానికి కాశీలో జన్మించిన కబీరు మరణించడానికి మషుర్‌ చేరుకొని అక్కడ తన తుదిశ్వాస విడిచాడు. దీన్ని బట్టి కబీరు పట్టు దలా, భోదనల సారం, మానవ విలువలకు నిబద్ధతా ఎంత అవసరమో అర్థమ వుతుంది. ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించుకొనేందుకు ఉద్యమించే దళిత, సామాజిక శక్తులు కబీరులోని భావవాద భావజాలాన్ని పరిహరించి ఆయన తత్వసారాన్ని ఆయుధాలుగా మలచుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.
 దేవుడు-మతం-కులం-వర్గం
                  జీవ పరిణామ క్రమంలో శిఖరాగ్రాన్ని చేరినవాడు - మానవుడు. నేడు మనిషి- మనిషిగా జీవించేందుకు ఎంతమాత్రం అవకాశం లేదు. ఇందుకు కారణాలు నాలుగు. 1) దేవుడు 2) మతం 3) కులం 4) వర్గం . ఇవి మనిషిలోని మానవత్వానికి మత్తుమందు జల్లి, అతని చైతన్యాన్ని మంటగలిపాయి. మానవుల్ని ఛిన్నాభిన్నం చేసి, వారిని చెక్క ముక్కల కింద చీల్చి వేశాయి. మానవ జీవిత స్వేచ్ఛను అరికట్టి, అవి మానవత్వానికి ఊపిరిపోశాయి.
మానవ అజ్ఞానంలోంచి పుట్టినవాడే దేవుడు. ప్రకృతిలో తన దృష్టికి కనిపించే వస్తువుల్నీ, జరిగే సంఘటనల్నీ శాస్త్రీయ దృష్టితో అర్థం చేసుకోలేని నాటి ఆదిమ మానవుడు తనకన్న పూర్తి భిన్నమైన ఏదో మహాశక్తియో, మహాశక్తులో ప్రకృతి ఉనికికి కారణమై ఉంటాయని భావించాడు. అతడు అప్పటికింకా ప్రకృతి గర్భం నుంచి బొడ్డు కోసుకుని బైటపడలేదు. ఇంకా ప్రకృతిలో భాగంగానే ఉంటున్నాడు. నిప్పు, నీరు, గాలి, నేల ఇత్యాది ప్రకృతి శక్తులకు దైవత్వమారోపించడం ద్వారా ఆదిమ మానవుడు మొట్టమొదటి దేవుళ్లను సృష్టించాడు.
 
మానవుడు మృగదశలో ఉన్నప్పుడు కొండగానో, బండగానో, ఏరుగానో, చెట్టుగానో వెలసిన దేవుడు, మానవ విజ్ఞానం అభివృద్ధి చెందినకొద్దీ కొండ- బండ రూపాన్ని వదిలి - మృగమై, ఆ పిదప మనిషై, ఆ తర్వాత నిరాకారుడై నిరంజనుడై నిర్వికల్పుడై చిట్టచివరికి అదృశ్యమైపోయాడు. అంటే మత సిద్ధాంతాలు అభివృద్ధి చెందిన కొద్దీ, ఈ దేవుళ్ళు ప్రకృతి శక్తులతో తమకున్న సంబంధాన్ని వదిలించుకుని ఊహాప్రపంచంలోకి అమాంతం వెళ్లిపోయాడు.
 
నిరాకారుడైన దేవుడికి మళ్లీ పూజారి వర్గం ఒక ఆకారం కల్పించింది. పూజాపుస్కారం, నామకరణం, అన్నప్రాశన, పెళ్ళీ పేరంటం, వ్యభిచారం, ఇత్యాది అమాంబాపతు లక్షణాలన్నీ పూజారివర్గం దేవుళ్ళకు అంటగట్టింది. తిండిపోతు దొంగలైన పూజారులు, దేవుడనే బూచిని తమస్వార్థ సంకుచిత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారు. తత్ఫలితంగా మనుషులు చేసిన దేవుళ్ళ చేతిలో మనుషులే బానిసలుగా మారిపోయారు.
 
దేవుడనే బూచిని చూపి, మనిషి మెదడుపై జల్లిన మత్తుమందే - మతం. ఈ మతం పేరిట, మానవుల మధ్య అభేద్యమైన కోటగోడలు కట్టారు. ఈ మతం పేరిటే, మతకర్తలు, మతోన్మాదులూ మారణహోమం గావించి, మానవ రుధిరాన్ని ఏరుల్లా పారించారు. మానవ శిరసుల్ని కోట గుమ్మాలకు చట్టారు. ఆది శంకరుడు లాంటి మత దురహం కారులు , జైన- బౌద్ధ- చార్వాకుల చెవుల్లో సీసం కాసిపోశారు. ఆర్యులు అనార్యుల్నీ, యూదులు క్రైస్తవుల్ని, కేధలిక్కులు ప్రొటెంస్టెంట్లనీ, మతం పేరిటే క్రూర మృగాలకన్న దారుణంగా చిత్రవధ చేశారు.
 
గొరికి పారేసిన వెంట్రుకలిస్తే దేవుడు మురిసిపోయి, కోరిన వారాల్నీ శిరిసంపదలను ఇస్తాడనేంతదాకా, ఈ మతమే నేడు జనంలో ప్రచారం చేస్తోంది. ఈ లోకంలోని మానవుల కష్టసుఖాల్తో సంబంధంలేని మతం, చచ్చింతర్వాత స్వర్గాన్ని చూపి బెల్లిస్తోంది. అంచేత, ఈ మతం నల్లమందు. ఈ మతం - తిండిపోతు దొంగల కేంద్రం. ఈ మత కర్మల్ని ఆసరాచేసుకున్న పూజారి వర్గం, అమాయక ప్రజల జేబులు గొడుతోంది. అంచేత, ఈ మత పిచ్చిని నాశనం జేయనంతదాకా , మానవుడు మానవుడుగా మనలేడు. మానవత్వానికి చోటులేదు.
 
ప్రపంచంలో ఏ దేశంలో లేని కులం కుష్టురోగం ఈ దేశంలోని హిందువులకే దాపురించింది. చరిత్ర పరిణామ క్రమానికి చెందిన ఒకానొక దశలో , శ్రమ విభజన కోసం ఏర్పడ్డ వర్ణ వ్యవస్థ నేటి కుల వ్యవస్థగా రూపుదాల్చింది.
 
బ్రహ్మదేవుని తలలోంచి బ్రాహ్మలు, భుజాలలోంచి క్షత్రియులు, కడుపులోంచి వైశ్యులు, కాళ్ళలోంచి శూద్రులు పుట్టారని హిందూ, పురోహిత వర్గానికి చెందిన ధర్మశాస్త్రవేత్తలు ప్రచారం చేశారు. అయితే, పంచములు దేవుని ఏ అంగంలోంచి జన్మించారో ఈ వంచకులు మాత్రం చెప్పలేదు.
 
మొదట్లో మూడు వర్ణాలన్నారు. తర్వాత నాలుగన్నారు. నేడు 2030 కులాలూ, లక్షకి పైగా చిల్లర తెగలూ హిందువుల్లో ఉన్నాయి. అంటరానివారనీ, చెప్పరానివారనీ, ఛండాలురనే పేర్లు పెట్టిన ఈ వైదిక పురోహితులు, కోటానుకోట్ల మానవుల్ని మాల- మాదిగ గూడేలకి తరిమేశారు. తరతరాలుగా వారిని పురుగులకన్నా హీనంగా చూశారు. అస్పృశ్యత ధర్మసమ్మతమేనని పూరీ శంకరాచార్యులు లాంటి ద్రోహులు, నేటికీ సిగ్గూ బిడియం లేకుండా ప్రచారం చేస్తున్నారు. అంచేత, ఈ కుల తత్వ పిశాచాన్ని, ఏడు నిలువుల లోతున పాతెయ్యనంతదాకా ఈ జాతికి విముక్తి లేదు. ఈ జనానికి భవిషత్తు లేదు. అధికుడని, అధముడనీ కులాల్ని సృష్టించి , నేటికీ అవి ధర్మ సమ్మతమేనని వదరుతున్న వారిని ప్రజా ద్రోహులుగా పరిగణించాలి. సమస్త మానవులూ సమానమేనన్న మానవతా వాదానికి పట్టాభిషేకం చేయాలి.
ఆదిమ మానవ సమాజంలో, ఉన్నవాడూ లేనివాడూ అనే భేదం లేకుండా, అంతా సమిష్టి కృషి ద్వారా సుఖంగా జీవించారు. సమాజంలో ప్రయివేటు ఆస్థి రావడంతో, మానవులు ధనికులుగాను, దరిద్రులుగానూ చీలిపోయారు. అతికొద్ది మంది కుబేరులు, అశేష ప్రజానీకాన్ని పీడించి కోట్లకి పడగ లెత్తుతుంటే, కోటానుకోట్ల ప్రజలు భీకర దారిద్య్రంలో హీనంగా బతుకుతు న్నారు. అంచేత, ఈ ఆర్థిక అసమానతులు లేని సమాజ నిర్మాణం జరగాలి.
 

మహాజన మాతృమూర్తి సావిత్రీ భాయి ఫూలే

                 ఆ మహనీయురాలి పేరు మననం చేసుకోకుండా ఈ దేశ స్త్రీ విముక్తి ఉద్యమాల గురించి స్మరించుకోలేం. ఆ మానవతామూర్తి ఆచరణనుంచి స్ఫూర్తి పొందకుండా ఈ దేశ అనగారిన జన ఉద్యమాలను ముందుకురికించలేం. ఆమే సావిత్రీ భాయి ఫూలే. కోట్లాది అణగారిన జనాలకు అమ్మతనాన్ని రుచి చూపించిన మహాజన మాతృమూర్తి .'రెండు శరీరాలు ఒకే హృదయం. లక్ష ఆశయాలు ఒకే ఉద్యమం' గా సాగిన జ్యోతిరావు ఫూలే- సావిత్రీ భాయి ఫూలే ల జీవన సహచర్యం యావత్‌ మానవ జాతికే ఆదర్శనీయం. 'మానవ జీవితాలను గాయపరచే ప్రతి అమానవీయ ఆచరణపై యుద్ధం - అదే మనిషితనానికి అర్థం' అంటూ తమ నిండు జీవితాలను నిర్భాగ్యుల ఉద్దరణకై అకితం చేసిన ఆ ఆదర్శనీయుల ఆచరణను అనుసరిద్దాం.
1831 జనవరి 3న పూనే దగ్గరలోని కవాజి గ్రామంలో జగదేవ్‌పాటిల్‌ కుటుంబంలో సావిత్రీబాయి జన్మించింది. ఎనిమిదేండ్ల వయస్సులో జ్యోతిరావుపూలేతో పెండ్లి(1840) జరిగింది. అప్పటికీ జ్యోతిరావుపూలేకు పదమూడేండ్లు. వారికి పెండ్లంటే తెలియనీ వయస్సు. తన భర్తను ప్రేమించడమంటే భర్త ఆశయాలను ప్రేమించడమేనని అక్షరాల రుజువు చేసింది. సావిత్రీబాయి లేకుండా జ్యోతిరావు పూలే ప్రారంభించిన మహోజ్వాలమైన సాంఘీక విప్లవాన్ని, సాంఘీక సంస్కరణల్ని, శూద్ర విద్యాలయాల నిర్వహణను గానీ మనం ఊహించలేము.
ఆ రోజుల్లో హిందూమతం స్త్రీలకు, అట్టడుగు కులాల వారికి విద్యను నిషేదించింది. సమాజంలో స్త్రీకి అత్యున్నతమైన స్థానం ఉందని చెబుతూనే మరో వైపు విద్యకూ దూరంగా పెట్టారు. నలుగురిలో తిరిగితే లేచిపోతుందెమో.. స్వతంత్రం ఇస్తే గౌరవాన్ని మంటగలుపుతుందెమో అన్న సందేహలను, భయాల్ని వ్యాప్తి చేసారు. ''నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి'' అని శాసనం చేసారు. స్త్రీ చదువుకుంటే ఆమె భర్త అర్థాంతరపు చావు చస్తాడనే ప్రచారం చేసారు. ఆ సమయంలో స్త్రీల కోసం పాఠశాలను తెరిచాడు జ్యోతిరావుపూలే. ఎవరూ ముందుకురాని సమయంలో సావిత్రీబాయి ఆ బాధ్యత తీసుకుంది. తాను చదువుకుని పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేసింది. ఒక శూద్ర స్త్రీ చదువుకొని, అంతటితో ఆగకుండా శూద్రులకు, అతిశూద్రులకూ, స్త్రీలకు చదువు చెప్పి నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్రాహ్మణ సమాజం ఈ విషయాన్ని తీవ్రమైనదిగా పరిగణించింది. ఆమెను తిట్టడం, శాపనార్థాలు పెట్టడమే కాకుండా ఆమె బడికెళ్తున్నప్పుడూ, వస్తున్నప్పుడూ ఆమెపై బురదజల్లడం, రాళ్లురువ్వడం చేసారు. అవమానాలకు సావిత్రీబాయి చిరునవ్వే సమాధానమైంది. మానసికక్షోభకు గురి చేసినా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నానన్న తృప్తితో ఒక దీక్షగా, ఒక తపస్సుగా తాను చేయదలచుకొన్న పనిని నిర్భయంగా చేసింది. జ్యోతిరావు ప్రతి అడుగులోనూ ఆమె ముందు నడిచింది. తన ఆశయాలను ప్రచారం చేసేందుకు అనేక కవితలు రాసింది. 1854లో కావ్యపూలే పేరుతో కవితల సంపుటి ప్రచురితమైంది. ఆమె చేసినా ఉపన్యాసాలు, రాసిన వ్యాసాలెన్నో వున్నాయి. 1890లో జ్యోతిరావు పూలే మరణించే సమయంలో భార్య సావిత్రీబాయి, కుమారుడు యశ్వంత్‌ల బాధ్యతలను సత్యశోధక సమాజ్‌కు అప్పగించాడు. ఆ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించారు. స్త్రీలు మనుషులేననీ, స్త్రీల హక్కులే మానవ హక్కులనీ చాటి చెప్పిన ధీర వనిత సావిత్రీబాయి. అంటరాని తనాన్ని, కుల వ్యవస్థను ఆమె ఎదురించిన తీరు మహిళా ఉద్యమాలకు ఆదర్శం. భారతీయ సమగ్ర సామాజిక విప్లవానికి కావలసిన ముడి సరుకు. ఆ దంపతులు ఆచరణాత్మక సిద్ధాంత గ్రంథం. వారు చూపించిన ప్రేమ, త్యాగం మరువలేనివి. భర్తతో పాటే సమతా భావాలున్నా సావిత్రీబాయి స్వయం ప్రకాశి. స్వతంత్ర వివేచనా శక్తి జ్ఞానం పట్ల ఆకాంక్ష ఆమెను ముందుకు నడిపించాయి.
 
సావిత్రీబాయిది నిరాడంబర జీవితం. ఆమె స్వయంగా తన దుస్తులు తానే నేసుకునేది. కుట్టుకునేది. ఆమె ఖాదీ దుస్తులను ధరించేది. 1920 నుంచే భారతదేశంలో ఖాదీ ఉద్యమం ప్రారంభమయిందనేది ప్రచారంలో ఉంది. చాలా మంది ఆ ఆపోహలో ఉన్నరు. కానీ అంతకముందే ఖాదీ ధరించి మార్గ దర్శనం చేసింది పూలే దంపతులే. జ్ఞానం, చదువులు పోతపోసిన నిలువెత్తు విగ్రహం. మహిళలు చదువుకుని తమ కాళ్లపై నిలబడాలని తపించింది సావిత్రీబాయి. మహిళల్లో చైతన్యం నింపడానికి మహిళా సేవా మండలిని ప్రారంభించింది. అంటరానితనం నిర్మూలన, స్త్రీ సమస్యల పరిష్కారం కోసం భారతదేశంలో స్థాపించిన తొలి మహిళా సంస్థ ఇది.
''విద్య ఒసగును వినయమ్ము'' అనే నానుడికి సావిత్రీబాయి ఒక మంచి ఉదాహారణ. వినయమే ఆమె ఆభరణం. తాను చేస్తున్న కృషి అంతా తన భర్త చలవేననీ, తాను ఆయన చూపిన బాటలో నడుస్తున్నాననీ, తాను చేసే ప్రతి పనికి జ్యోతిరావుపూలేనే ప్రేరణ అని, తనను జ్ఞానవంతురాలిని చేసి వెలుగు మార్గంలా నడిపారు అని చెప్పటం ఆమె వినయాన్నీ, సమయ స్ఫూర్తినీ చాటుతుంది. సమాజ హితం కోసం మహాత్మాపూలే తన జీవితాన్ని అంకితం చేశారన్నది ఎంత నిజమో అందులో సావిత్రీబాయి కృషి కూడా అంతే ఉందన్నది నిజం.
సావిత్రీబాయి నిస్వార్థ సేవను చూసి సహయం చేసేవారు ఒక వైపు, ఆమెను విమర్శించినవారు సమాజంలోంచి వెలి వేయాలని మనుధర్మవాదులు బాహాటంగా అనేవారు. వారు విష ప్రచారం చేసినా సావిత్రీ బాయి చలించలేదు. ఆమె స్త్రీ విద్య, సమాజ సేవ అనే ఉన్నత లక్ష్యాలను తలకెత్తుకుంది. ఎటువంటి కష్టానష్టాలను ఎదురైనా లక్ష్యాలను వదిలిపెట్టలేదు. తన బుద్ది, జ్ఞానం, ప్రజలకు, బహుజనులకు ఉపయోగపడాలనే లక్ష్యంతో ఆమె జీవిత ప్రయాణాన్ని కొనసాగించింది.
అత్యంత ధైర్యశాలి, స్వభావం అంచంచలమైంది. దృఢనిశ్చయంతో తన నిర్ణయాలను అమలు చేసే ఉన్నత వ్యక్తిత్వం ఆమెది. 150 ఏండ్ల కిందట పోకిరీలు, అల్లరిమూకల ఆగడాలను, వేదింపులను ధైర్యంగా ఎదుర్కోంది. ''ఆడవాళ్లకు అస్పృశ్యులకు చదువు చెప్పారో ఖబడ్ధార్‌'' అని బెదిరించిన గుండాలకు చెప్పుతో బుద్ది చెప్పిన వీరనారి.
 
1976-77 కాలంలో మహారాష్ట్రలో ఏర్పడిన భయంకరమైన కరువుకు అన్నం, నీళ్లు లేక లక్షలాది మంది ప్రజలు చనిపోతుంటే పూలే దంపతులు భోజనకేంద్రాలు నడిపారు. అన్నదానం చేసారు. సత్యశోధక సమాజం రెండు వేల మంది విద్యార్థులకు ఆహార బాధ్యత తీసుకొని ఉచితంగా ఆహారాన్నందించారు. కరువు కాలంలో రోజూ రొట్టెలు, ధాన్యం సేకరించి, భోజన కేంద్రాలలో అందించారు. వేలాది మందికి తిండి పెట్టడం ద్వారా మహారాష్ట్ర సమాజానికి ఆమె తల్లిలా మాతృత్వం పంచిందంటే ఆతిశయోక్తి కాదు. వారిది ఆచరణాత్మాక సిద్ధాంతం. అందుకే వారు చిరస్మరణీయులు.
ఆ రోజుల్లో హిందూ మత అంధవిశ్వాసాలతో మూఢనమ్మకాలతో భారత సమాజం ఉండేది. స్త్రీల జీవితం పశువులకంటే హినంగా ఉండేది. బ్రాహ్మణ స్త్రీల పరిస్థితి మరీ దారుణం. బాల్య వివాహాలతో చిన్న వయస్సులోనే విధవలు కావడంతో వారి పరిస్థితి అత్యంత హినంగా ఉండేది. వారిపై అత్యాచారాలకు అంతూపోంతూ ఉండేది కాదు. గర్భవతులైన వితంతువులు గర్భస్రావం చేయిం చుకుని గౌరవాన్ని కాపాడాలనుకునేవారు ఒక్కోక్కసారి గర్భస్రావం విఫలమై మృత, లేదా అంగవైకల్యం, బుద్ది మాంద్యంతో కూడిన శిశువులకు జన్మనివ్వవలసి వచ్చేది. జన్మించిన శిశువులను హత్య చేయవలసి వచ్చేది. ఈ పరిస్థితుల్లో వితంతువులకు ఆశ్రయమిచ్చేందుకు ''బాల హత్యా ప్రతి బందక్‌'' గృహాన్ని సావిత్రీబాయి ప్రారంబించారు. వితంతువులను ఆదుకునేది. తమ ఇంటిని ఆశ్రమంగా మలిచారు. 66 మంది శిశువులను ఆదరించి ధైర్యం చెప్పింది. ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఒక బ్రాహ్మణ బాల వితంతు కుమారున్ని దత్తత తీసుకున్నారు. మానవత్వానికి పూలే దంపతులు, వారి గృహం చెక్కుచెదరని ఉదహరణ. రాష్ట్ర మంతటా ప్లేగు వ్యాధి ప్రబలినపుడు రోగుల దగ్గరుండి సేవ చేసింది ఆ మాతృమూర్తి. తన కుమారుడు యశ్వంత్‌ నడుపుతున్న వైద్యశాలకు ప్లేగు పీడితుల్ని తరలిస్తూ, ప్లేగు రోగుల్ని రక్షించే క్రమంలోనే వ్యాధికి గురై మార్చి13, 1897న ఆమె మరణించింది.

బతికినంతకాలం నిరుపేదల నిమ్న వర్గాల కోసం కృషి చేసిన సావిత్రీబాయిని భారత సమాజం మరచీపోలేదు. ఆమె జయంతిని మహిళా టీచర్స్‌ దినోత్సవంగా గుర్తించాలనీ ఉద్యమాలు నడుస్తున్నాయి. ఆమె స్ఫూర్తితో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనీ, మహిళ సాదికారత కోసం ఉద్యమిస్తున్నారు. ఈనాడు మహిళా లోకం ఆమెను గుండెల్లో నిలుపుకోవాలి. ఆమె వెలుగించిన బాటల్ని కండ్లకు వెలుగు భూమికలుగా అమర్చుకోవాలి. కులం, వర్గం, జండర్‌, జాతి, మతం సకల పీడిత పక్షాల వహించే విశాల విహంగ విశ్వదర్శిని సావిత్రీబాయి పూలే దార్శనికత.

కుల, మతాచారాలపై అగ్గిపిడుగు - బసవడు

 11, 12 శతాబ్దకాలంలో సమసమాజ స్థాపన కావాలని కాంక్షించినవాడు.. భక్తి మార్గం తో సామాజిక మార్పుకు నాంది పలికిన వాడు.. కుల, మతాలను నిరసించినవాడు.. వర్ణాంతర విహహాలు చేసి అగ్రకుల పెత్తందార్లచే ఆగ్రహానికి గురైనవాడు.. సంహఫంక్తి భోజనాలు పెట్టి కుల నిర్మూలన జరగాలని కంకనం కట్టుకున్నవాడు.. అతడే బసవేశ్వరుడు.. శ్రమకు పట్టంకట్టి మూఢచారాలనుండి పీడితుల్ని విముక్తి చేసి బస్వరాజ్గా నిలిచిండు. శ్రమైక్య జీవన సౌందర్యాన్ని చాటి విప్లవపథాన్ని సృష్టించిన బసవన్నను మననం చేసుకోవడం నేటి సమాజానికి చారిత్రక అవసరమే...
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్జిల్లా బాగేవాడి బసవేశ్వరుడి జన్మస్థలం. 1134లో ఎప్రిల్‌ 30 మండెన మాదిరాజు, మాతాంబిక దంపతులకు జన్మించాడు. చిన్న తనంలోనే శైవపురాణ గాధలను విన్నాడు. వాటి ప్రభావం ఆయనపై పడింది. కర్మకాండపై విశ్వాసం తొలగిపోయింది. తండ్రి కుమారుడికి ఉపనయనం చేయాలని చూస్తే స్త్రీలకు లేనిది తనకు అక్కర్లేదని తిరస్కరించాడు. నిర్మల శివ భక్తి నిష్టితుడికి, కేవలం యజ్ఞాది వైదిక కర్మలతో కాలం పుచ్చే బ్రాహ్మణ్యంతో పనేమిటి? అని తండ్రితో వాదించాడు. ఏనిమిదేండ్ల వయస్సులోనే ఉన్నత ఆలోచనలు చేసి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. కల్యాణపురం చేరుకున్నాడు.
కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చేరాడు. చిన్న ఉద్యోగిగా చేరి అనతికాలంలో కీలకస్థానాల్లోకి చేరుకున్నాడు. భాండాగారానికి ప్రధాన పదవిలోకి వచ్చాడు. భక్తి మార్గాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు. అధికారం కూడా అదనంగా ఉపయోగపడింది. అణచివేయబడుతున్న కులాల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని సంకల్పం పెట్టుకున్నాడు. సాహిత్యాన్ని సాధనంగా చేసుకున్నాడు. వీర శైవ సిద్ధాంతాన్ని తన రచనల ద్వారా, బోధనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ఇవి ప్రజల్లో తీవ్ర మార్పుకు కారణమయ్యాయి. పరిపాలన రంగంలో మార్పులు తీసుకువచ్చాడు. వివక్షతను నిర్మూలించేందుకు సంఘసంస్కరణకు శ్రీకారం చుట్టాడు. దీంతో ఇతర మత ఛాందసవాదులకు, సనాతనులకూ బసవేశ్వరుడు శత్రువుగా మారాడు. ఆయన స్థాపించిన 'అనుభవ మండపం'లో అందరికి స్థానం కల్పించాడు. కుల, మత, లింగ వివక్ష చూపలేదు. బసవేశ్వరుడి సోదరి నాగమ్మ, మేనల్లుడు చెన్న వీరప్ప, బసవన్న భార్యలు నీలాంబిక, గంగాబికలు ఆయన మార్గాన్నే అనుసరించారు. ధర్మ ప్రచారాన్ని చేపట్టారు. 
కులాలు మానవ సృష్టియేనని స్పష్టీంకరించాడు. దేహమే దేవాలయమన్నాడు(కాయమే కైలాసమని). స్త్రీ, పురుష భేదం లేదని చాటాడు. మానవ ప్రవర్తన కీలకమన్నాడు. శ్రమకు గుర్తింపునిచ్చాడు. సాంఘిక దురాచారాలను, మూఢవిశ్వాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన పెండ్లిని శాస్త్ర, సంప్రదాయాలకు భిన్నంగా చేసుకున్నాడు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మధువరసుని కుమార్తె లావణ్యవతితో దళిత కుటుంబానికి చెందిన హరలయ్య కుమారుడు శీలవంతడితో పెండ్లి జరిపించాడు బసవేశ్వరుడు. పెండ్లి పట్ల వ్యతిరేకత ఏర్పడింది. వర్ణాంతర విహహం చేసుకున్న దంపతులు హత్యగురయ్యారు. బసవేశ్వరుడు ఎంచుకున్న మార్గంతో బిజ్జలుడికీ బసవేశ్వరుడి మధ్య విబేధాలు పొడచూపాయి. పదవిని వదిలేలా చేసాయి. దేశబహిష్కరణకు గురయ్యాడు. సంగమేశ్వరుని సన్నిధిలో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. 'ఎందులకీ కులగర్వము నీకిల, ఏమీ కర్ణమునుండి వచ్చితివా, మైలవచ్చు మార్గమున వచ్చితివి' అంటూ తత్వ్తాన్ని భోదించిన బసవేశ్వరుడు 1196లో సమాజం నుండి భౌతికంగా దూరమయ్యాడు. తరగని విజ్ఞాన సంపదనందించి చరిత్రలో చెరగని ముద్రగా, టీవీగా నిలబడ్డాడు. 
బసవేశ్వరుడు బోధించిన బోధనలు లింగాయత ధర్మంగా మార్పు చెందాయి. బసవడి లక్షలాది వచనల్లో వేల వచనాలు మాత్రమే లభ్యమయ్యాయి. బసవేశ్వరుడి నుండి స్ఫూర్తి పొందిన పాల్కురికి సోమనాథుడు 'బసవ పురాణం' గ్రంథం రాసాడు. వీరశైవ ప్రచారానికి, బసవేశ్వరుడి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి సోమనాధుడి రచనలు దోహదపడ్డాయి

లోకాయతులు

చార్వాక భౌతికవాదుల్ని, లోకాయతులు, లోకాయతికులు, లౌకాయతికులు అనే పేర్లతో పలిచారు. సంస్కృత నైషధకరమైన శ్రీహర్షుడు, నైషదకావ్యం 17 సర్గ- 94 శ్లోకంలో, లోకాయత శబ్దాన్ని నాస్తికార్థంతో ప్రయోగించాడు. అమరటీకాకారుడు, లోకాయతమంటే చార్వాక శాస్త్రమని రాశాడు. లోకాయతం - తర్కశాస్త్రానికి పర్యాయ పదమని శబ్ద కల్పద్రుమకారుడు రాశాడు. మానవ మేధస్సు సృష్టించగలిగిన ఉత్కృష్ట తర్కశాస్త్రాన్ని, చార్వాక హేతువాదులు అభివృద్ధి చేసినట్లు, దీన్ని బట్టి అర్ధమవుతోంది. అంచేతనే పురోహితవర్గ సోంబేర్లు, చార్వాకుల్ని వితండవాదులూ, శుష్కతర్క ప్రియులని నోరారా తిట్టారు.పరలోక సంబంధమైన ఆత్మ పరమాత్మ, మోక్షం, పూర్వ జన్మ, పునర్జన్మ, స్వర్గ నరకాలు, కర్మ సిద్దాంతం యిత్యాది సరుకంతా, పారలౌకిక విషయాల కిందకి వోస్తుంది. పారలౌకిక విషయాలన్నిటినీ నిరాకరించి, వాటిని అత్యంత దారుణంగా గేలిజేసి, మానవ జీవితానికి ప్రప్రథమ ప్రాతిపదిక లోకానికి చెందిన సుఖదు;ఖాలని ప్రతిపాదించి, అశేష సామాన్య ప్రజల్లో విశేష ప్రచారం జేసినవారు గాబట్టే, వారికి లోకాయతులు అనే అన్వర్థ నామం వొచ్చిందని భావిస్తోన్నాను. 

లోకాయుత -అంటే ప్రజల్లో విశేషంగా వ్యాప్తి జెందినవారని అర్థం. చెట్టూ పుట్టా కొట్టి, సేద్యం జేసేవారనే అర్థం గూడా వున్నట్లు చెబుతొన్నారు. ఏది ఎమైనా, 2500 సంవత్సరాలకి పూర్వమే, లక్షోపలక్షల బానిసలకూ, దాసులకూ మహోజ్వల సందేశాన్ని అందజేసి, వారిలో ప్రగాఢ ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసి, యావత్అంధవిశ్వాసాలకీ పాడెగట్ట యత్నించి, పరాన్నభుక్కులు సృష్టించిన పరమేశ్వరుడికి ఏడు కట్ల సవారీని సిద్ధం చేసి, పాలక వర్గ నిరంకుశాధికారానికి వ్యతిరేకంగా తిరగబడ్డ విప్లవకారులే లోకాయతులు. నాస్తికులు-చార్వకులు-హైతుకులు-(వేదవిరోధులు) దేహాత్మవాదులు అనే పేర్లు వైదిక పండితులు వారికిచ్చిన వివిధనామాలు, నాటి హేతువాదులు, తమనితాము లోకాయతులు అనే పేరుతోనే పిలుచుకొన్నట్లు కనిపిస్తోంది. లోకాయత ఉద్యమం, పాలకుల ఉద్యమం గాదు- పాలితుల ఉద్యమం. ఇది భూస్వాముల ఉద్యమం గాదు. పాలికాపుల ఉద్యమం. ఇది విజేతల ఉద్యమంగాదు -పరాజితుల ఉద్యమం. ఇది బానిస యజమానుల ఉద్యమం గాదు - బానిసల ఉద్యమం. ఇది యావత్నిష్ట దరిద్రుల, సంఘ బహిష్కృతుల ఉద్యమం. భారతీయ కార్మిక -కర్షక ఉద్యమానికి పితామహునిలాంటి ఉద్యమం. ఇది - నాఉద్యమం; ఇది -నీ ఉద్యమం; ఇది మన ఉద్యమం, ఒక్కమాటలో, నాటి యావత్కష్టజీవుల సాంస్కృతిక - సాంఘీక విప్లవమే లోకాయత మహోద్యమం


Article by :-

Dr. Parvatham Venkateshwar
   9177566741